Begin typing your search above and press return to search.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బండి సంజ‌య్‌ కు ఊహించ‌ని షాక్‌

By:  Tupaki Desk   |   5 May 2022 9:05 AM GMT
సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బండి సంజ‌య్‌ కు ఊహించ‌ని షాక్‌
X
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ‌ర్సెస్ ప్ర‌తిప‌క్ష బీజ‌పీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టీఆర్ఎస్ - బీజేపీల మ‌ధ్య అయితే ప్ర‌భుత్వ విధానాల నుంచి మొద‌లుకొని రాజ‌కీయప‌ర‌మైన అంశాల వ‌ర‌కూ కామెంట్ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కరీంనగర్ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజయ్ ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తూ పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేస్తున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో సొంత పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌నకు ఊహించ‌ని షాక్ ఎదురైంది. బండి సంజ‌య్ కనబడటం లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. టీఆర్ఎస్ యూత్ నేతలు ఇలా వినూత్న నిరసన చేపట్టారు.

ఎంపీగా గెలిచి మూడు సంవత్సరాలు గడుస్తున్నా నియోజవర్గ అభివృద్ధికి చేసిందేమి లేదని సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీ సంజయ్‌ చిత్ర పటంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. బండి సంజయ్ ఎక్కడైనా కనిపిస్తే కరీంనగర్ పార్లమెంట్‌ నియోజకవర్గానికి పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. తన నియోజక వర్గ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే యాత్రల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ముందు తన నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చి ఎక్కడైనా తిరుగొచ్చని టీఆర్ఎస్ నేత‌లు పేర్కొన్నారు.

కాగా, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుకు ఒక రోజు ముందే సిరిసిల్లా మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ద‌మ్ముంటే క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌కు ఒక వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాల‌ని బండి సంజ‌య్‌కు కేటీఆర్ స‌వాల్ చేశారు.

కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ ప‌దం ఉండేదా? ఈ రాష్ట్రం వ‌చ్చి ఉండేదా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. రోడ్ల మీద తిరుగుతూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిడుతున్నారు. సోమ‌వారం, మంగ‌ళ‌వారం అంటూ రాజ‌కీయం చేయొద్దని కేటీఆర్ హెచ్చ‌రించారు. తెలంగాణ లేక‌పోతే ఇప్పుడు మాట్లాడేవారికి ప‌ద‌వులు వ‌చ్చి ఉండేవా తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత కొంద‌రు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు.