Begin typing your search above and press return to search.

షర్మిలకు ఊహించని షాకిచ్చిన పోలీసులు ... షరతులతో అనుమతి , చివర్లో ట్విస్ట్ !

By:  Tupaki Desk   |   25 March 2021 9:26 AM GMT
షర్మిలకు ఊహించని షాకిచ్చిన పోలీసులు ... షరతులతో అనుమతి , చివర్లో ట్విస్ట్ !
X
వైఎస్ షర్మిల త్వరలో తెలంగాణ లో రాజన్న రాజ్యమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోంది. ఇప్పటికే తెలంగాణాలో పార్టీ పెట్టడం ఖాయం అని ప్రకటించిన షర్మిల , ఆ దిశగా చాలా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ , వారితో కలిసి మాట్లాడుతున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీలో నిలబడుతున్నట్టు కూడా ప్రకటించారు. ఇలా ఒక్కొక్క పనిని చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ దూసుకుపోతున్న షర్మిల కి తెలంగాణ పోలీసులు ఊహించని షాకిచ్చారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అట్టహాసంగా అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కోవిడ్ నిబంధనల కారణంగా కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

షర్మిల నిర్వహించదలచిన బహిరంగ సభకు అనుమతులిచ్చిన పోలీసులు, షరతులు విధించడం ఆసక్తికరంగా మారింది. ఖమ్మంలో వచ్చే నెల 9న సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభకు వైఎస్ షర్మిల సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా తెలంగాణలోని అన్నిజిల్లాల్లోని వైఎస్సార్ అభిమానులు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం సభకు అనుమతుల కోసం ఇప్పటికే పోలీసులకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే పోలీసులు సభకు అనుమతులు మంజూరు చేసినప్పటికీ, కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6 వేల మందితో సభ నిర్వహణకు పోలీసులు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని మెలిక పెట్టారు. సుమారు లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు.. జన సమీకరణపై షర్మిల టీమ్ దృష్టి పెడితే, పోలీసుల రిప్లైతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. సభ నిర్వహణకు సంబంధించి వైఎస్ షర్మిల అన్ని జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.