Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు షాక్‌.. పోటీకి వాళ్లు సై

By:  Tupaki Desk   |   18 Nov 2021 8:50 AM GMT
కేసీఆర్‌కు షాక్‌.. పోటీకి వాళ్లు సై
X
తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. ఇప్ప‌టికే ఎమ్మెల్యో కోటా కింద ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌డం.. వాటిని ఆమోదించ‌డం జ‌రిగిపోయింది. ఆ స్థానాలకు ఇతర పార్టీల నుంచి పోటీ లేదు కాబ‌ట్టి ఆ ఆరు స్థానాలు ఏక‌గ్రీవంగా టీఆర్ఎస్ ఖాతాలో చేర‌డం ఖాయ‌మైంది.

ఎమ్మెల్యో కోటా ఎమ్మెల్సీ స్థానాల‌ను ఇప్పుడు క్లీన్‌స్వీప్ చేసిన కేసీఆర్‌కు.. స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మాత్రం ఊహించ‌ని షాక్ త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. 12 స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తామ‌ని తెలంగాణ పంచాయ‌తీ రాజ్ ఛాంబ‌ర్ ప్ర‌క‌టించ‌డ‌మే అందుకు కార‌ణం.

తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 4తో పూర్త‌య్యే స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 12 స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 23న నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. న‌వంబ‌ర్ 26 వ‌ర‌కు వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

డిసెంబ‌ర్ 10న పోలింగ్ నిర్వ‌హించి 14న ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగే ఆయా చోట్లా టీఆర్ఎస్ బ‌లంగా ఉండ‌డంతో ఆ స్థానాల‌న్నీ ఆ పార్టీ ఖాతాలోకే చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆయా స్థానాల్లో అభ్య‌ర్థుల ఎంపిక గురించి ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ క‌స‌ర‌త్తు మొద‌లెట్టారు.

ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స‌భ్యుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి తెలంగాణ పంచాయ‌తీ రాజ్ ఛాంబ‌ర్ సై అంటోంది. రాష్ట్రంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంఘాల నేత‌లు వారం క్రితం స‌మావేశ‌మై త‌మ డిమండ్ల‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

లేదంటే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నామ‌ని చెప్ప‌డంతో పాటు తొమ్మిది స్థానాల్లో అభ్య‌ర్థుల పేర్ల‌నూ ప్ర‌క‌టించారు. న‌ల్గొండ‌, రంగారెడ్డి, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మెద‌క్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్‌లో పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌ను వెల్ల‌డించారు.

స్థానిక సంస్థ‌ల్లోనూ టీఆర్ఎస్‌కే బ‌లం ఉండ‌డంతో ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ విజ‌యం త‌థ్య‌మ‌ని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఎంపీపీ, జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ స‌భ్యులు పోటీకి దిగ‌డంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌న్న ఆస‌క్తి నెల‌కొంది.

నామినేష‌న్ల‌కు ఇంకా స‌మయం ఉంది కాబ‌ట్టి ఈలోపే తెలంగాణ పంచాయ‌తీ రాజ్ ఛాంబ‌ర్ నాయ‌కుల‌తో మాట్లాడి నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునేలా చూస్తార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బ‌తిమాలో బెదిరించో త‌న‌కు పోటీ లేకుండా చేసుకోవ‌డం కేసీఆర్‌కు అల‌వాటేనన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.