Begin typing your search above and press return to search.

ప్రియుడితో జంప్ అయిన సాయిప్రియ ఘనకార్యానికి సర్కారుకు రూ.కోటి

By:  Tupaki Desk   |   28 July 2022 4:11 AM GMT
ప్రియుడితో జంప్ అయిన సాయిప్రియ ఘనకార్యానికి సర్కారుకు రూ.కోటి
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటమే కాదు.. విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు తిట్టిపోస్తున్న సాయిప్రియ ఉదంతానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసిన వేళ.. భర్తకు షాకిస్తూ.. జంప్ అయిన ఆమెను వెతికేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల కోసం ఏకంగా రూ.కోటి ఖర్చు అయినట్లుగా తేలింది. భర్తకు మస్కా కొట్టి.. ప్రియుడితో ఎంచక్కా జంప్ అయిన ఆమె.. సముద్రంలో జాడ కనిపించకుండా పోయిందన్న భర్త సందేహంతో రంగంలోకి నేవీ.. హెలికాఫ్టర్ తో పాటు.. గస్తీ దళాలు పెద్ద ఎత్తున గాలింపులు జరపటం గమనార్హం. ఇంతా చేస్తే.. తాను తన ప్రియుడితో బెంగళూరు వెళ్లినట్లుగా సాయిప్రియ ఇచ్చిన సమాచారంతో అధికారులు.. పోలీసుల్ని కంగుతినేలా చేసింది. అమ్మగారి ఘనకార్యంతో రూ.కోటి ప్రజాధనం ఖర్చు అయినట్లుగా లెక్క తేల్చారు. ఆమె తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖపట్నంలోని అప్పలరాజు కుమార్తె 21 ఏళ్ల సాయిప్రియకు 2020 జులై 25న పెళ్లైంది. భర్త శ్రీనివాసరావు హైదరాబాద్ లోని ఒక ఫార్మా కంపెనీలు పని చేస్తున్నాడు. తమ పెళ్లై రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో పుట్టింటికి భర్తతో వచ్చిన ఆమె.. బీచ్ కు వెళ్లటం.. ఇద్దరు నీళ్లలోకి వెళ్లటం.. ఫోన్ రావటంతో భర్త బయటకు రావటం.. ఆ తర్వాత భార్య కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేయటం.. వారు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యల్నిచేపట్టటం తెలిసిందే. గాలింపు చర్యల్లో భాగంగా హెలికాఫ్టర్ ను రంగంలోకి తెచ్చి వెతికిన వైనం తెలిసిందే.

యువతి పేరెంట్స్ ఉన్న ప్రాంతంలోనే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఇల్లు ఉండటంతో.. మేయర్.. డిప్యూటీ మేయర్ ఇద్దరూ ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకొని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పెద్దలకు సాయం చేయాలని రిక్వెస్టు చేయటం.. వారు కలెక్టర్ కు చెప్పటంతో సాయిప్రియను వెతికేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా నేవీ.. కోస్ట్ గార్డ్.. గజ ఈతగాళ్లు కలిసి సముద్రం లోపల గాలించారు. రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన దానికి రూ.కోటి ఖర్చు అయినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. సముద్రంలో గల్లంతైన వారు ఎవరైనా సరే.. 24 గంటల్లో డెడ్ బాడీ బయటకు రావటం జరుగుతుందని.. అయినా రాలేదంటే ఆమె ఎక్కడికైనా వెళ్లి ఉంటుందన్న అనుమానం వ్యక్తమైంది. దీన్ని బలపరిచేలా బుధవారం సాయంత్రం సాయిప్రియ తన తండ్రి అప్పలరాజు ఫోన్ కు ఒక వాయిస్ మెసేజ్ పంపింది. తాను చనిపోలేదని.. బతికే ఉన్నానని.. తాను ఇష్టపడిన రవితో ఉన్నట్లుగా పేర్కొంది. తమ ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయిందని.. తమ గురించి వెతకొద్దని పేర్కొంది. తనకు చావాలని లేదని.. తన కోసం వెతికితే మాత్రం చనిపోతానని స్పష్టం చేసింది.

అదే వాయిస్ మెసేజ్ లో గవర్నమెంట్ కు క్షమాపణలు చెప్పింది. తనను క్షమించాలని.. తాను రవిని ఎంతోకాలంగా ప్రేమిస్తున్నట్లుగా పేర్కొంది. తమ కోసం వెతికితే తామిద్దరం చనిపోతామని స్పష్టం చేసింది. సాయిప్రియ గల్లంతైన అంశాన్ని తాము సీరియస్ గా తీసుకొని.. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఎంతో కష్టపడితే.. ఇలా జరగటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో విలువైన వనరులు వేస్టు కావటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక.. సాయి ప్రియ జంప్ అయిన ప్రియుడు రవి గురించి ఆరా తీస్తే.. తిరుపతికి చెందిన అతడి కుటుంబం చాలా కాలం క్రితం విశాఖపట్నానికి వలస వచ్చినట్లుగా గుర్తించారు. చాలా కాలం క్రితమే రవితో పరిచయం.. ప్రేమలో పడినా.. పెద్దలకు చెప్పకుండా ఉన్న ఆమె.. ప్రియుడితో వెళ్లిపోయింది. వెళ్లిపోయిన వైనంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ఇలా ప్రభుత్వాన్ని పరుగులు తీయించిన వైనంపై మాత్రం అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు.