Begin typing your search above and press return to search.

ఇంటర్ రీవెరిఫికేషన్ లో ఊహించని ట్విస్టులు

By:  Tupaki Desk   |   28 May 2019 9:36 AM GMT
ఇంటర్ రీవెరిఫికేషన్ లో ఊహించని ట్విస్టులు
X
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరగడం.. అది పెద్ద ఇష్యూ కావడం.. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిపోయింది. తెలంగాణ సర్కారు లేట్ గా స్పందించి అందరి పేపర్లను మళ్లీ దిద్దించింది. ప్రభుత్వం ఉచితంగా చేసిన ఈ రీవెరిఫికేషన్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

ఇంటర్ రీవెరిఫికేషన్ తర్వాత ఈ నెల 27న రాత్రి 9.30గంటలకు ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. 3,82,116మంది విద్యార్థుల జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేశామన్న బోర్డు.. ఇందులో పాస్ అయ్యింది కేవలం 1137మంది మాత్రమేనని సంచలన నిజాన్ని బయటపెట్టింది. ఈ విద్యార్థుల ఫలితాల్లో మాత్రమే మార్పులున్నాయని.. విద్యార్థుల ఫలితాల్లో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడం గమనార్హం.

అయితే కోర్టు ఆదేశాల మేరకు విద్యార్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలను వెబ్ సైట్ లో పెట్టాలన్న హైకోర్టు ఆదేశాలను ఇంటర్ బోర్డ్ అధికారులు తుంగలో తొక్కారు. వెబ్ సైట్ లో పాసయిన విద్యార్థుల హాల్ టికెట్లను మాత్రమే పెట్టడం వివాదాస్పదమైంది. 3 లక్షలకు పైగా విద్యార్థుల్లో 1137మంది మాత్రమే విద్యార్థులు పాస్ కాగా.. అందులో ఒక మార్క్ తో 88మంది పాస్ అవ్వడం విశేషం. ఇక రెండు మార్కులతో పాసయిన వారు 156మంది ఉన్నారు.

ఇక అన్నిటికంటే బ్రేకింగ్ అంటే తెలంగాణలో ఇంటర్ లో ఫెయిల్ అయ్యామని చనిపోయిన 23మంది విద్యార్థుల్లో రీవెరిఫికేషన్ లో 20మంది విద్యార్థులు తిరిగి ఫెయిల్ అయ్యారని అధికారులు తెలిపారు. ఆ విద్యార్థుల పరీక్షా పత్రాలను సీనియర్లతో దిద్దించామని.. అందులో ముగ్గురు మాత్రమే పాస్ అయినట్లు తెలిపారు. ఎక్కువ మార్కుల కోసం రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాల వెల్లడికి మరో మూడు రోజుల సమయం పడుతుందని బోర్డు అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థుల్లో మరింత టెన్షన్ వ్యక్తమవుతోంది.

ఇలా రీవెరిఫికేషన్ పేరిట ఫలితాలు విడుదల చేసి తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్కాన్ కాపీలను ఆన్ లైన్ లో మాత్రం ఉంచలేదు. హైకోర్టు ఆదేశాలను పాటించలేదు. పైగా ఎక్కువ మార్కుల కోసం దరకాస్తు చేసుకున్న వారి ఫలితాలను ప్రకటించకపోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.