Begin typing your search above and press return to search.

డిఫెన్స్ లో పడి కొట్టుకుంటున్న మోడీ కోటరీ

By:  Tupaki Desk   |   12 Nov 2015 4:30 AM GMT
డిఫెన్స్ లో పడి కొట్టుకుంటున్న మోడీ కోటరీ
X
బీహార్‌ లో ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం తాలూకు ప్రతిస్పందనలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. బీజేపీకి చెందిన సీనియర్లే కాకుండా చోటామోటా నేతలు కూడా ఈ ఓటమి పట్ల విరుచుకుపడటంతో మోదీ - అమిత్ షాలు తొలిసారిగా ఢిపెన్స్‌ లో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ బాసటగా నిలిచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యులని ఆరోపించడం అన్యాయమని గడ్కరీ ప్రతివాదన చేశారు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అమిత్ షా వైదొలగాలన్న డిమాండ్‌ ను కూడా తోసిపుచ్చారు. ‘‘మా పార్టీ కార్యకర్తల పార్టీ - ఓ కుటుంబ పార్టీ కాదు. విజయమైనా, పరాజయమైనా ప్రతి ఒక్కరూ బాధ్యులే’’ అని గడ్కరీ విలేకర్లతో అన్నారు.

తమ పార్టీ అగ్ర నేత అద్వానీ నాయకత్వంలోనూ ఎన్నికల్లో ఓటమి ఎదురైన సందర్భాలున్నాయన్నారు.. బీహార్ ఎన్నికల్లో ఓటమికి కారణాన్ని వివరిస్తూ మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసినందువల్ల మహా కూటమికి కలిసొచ్చిందన్నారు. తాము మరో 5.7 శాతం ఓట్లను పెంచుకోవాల్సి ఉందన్నారు. బీజేపీకి అనేక విజయాలతో పాటు పరాజయాలు కూడా ఎదురయ్యాయన్నారు. బీజేపీ అంటే వ్యక్తులకు చెందిన పార్టీ కాదని తెలిపారు. వివాదాస్పద ప్రకటనలిచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ చీఫ్ అమిత్‌ షాను కోరినట్లు చెప్పారు.

బీజేపీ వ్యక్తులకు చెందిన పార్టీ కాదని వాదిస్తున్న గడ్కరీ ఒకరిద్దరు సీనియర్లు పార్టీ పరాజయంపై నిలదీసినంతమాత్రానే మోదీకి వత్తాసుగా ఎందుకు నిలుస్తున్నారో సమాధానమివ్వాల్సి ఉంటుంది. పైగా అద్వానీ హయాంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత ఘోర పరాజయం పార్టీకి మిగిలిన చరిత్ర లేదు. ఓటమికి మూలకారకులైనవారు మౌనం పాటిస్తుంటే గడ్కరీకి ఇంత వత్తాసు పలకవలసిన అవసరం ఏమిటనేది ప్రశ్నగా మిగిలింది.,