Begin typing your search above and press return to search.

20 ఏళ్లు జైల్లో ... చివరిగా నిర్దోషిగా విడుదల !

By:  Tupaki Desk   |   4 March 2021 6:34 AM GMT
20 ఏళ్లు జైల్లో ... చివరిగా నిర్దోషిగా విడుదల !
X
కోర్టుల్లో కొన్ని కేసులు అంత త్వరగా తేలవు. కొన్ని ఏళ్ల పాటు అలా సాగుతూనే ఉంటాయి. అసలు ఆ కేసు పెట్టిన వ్యక్తి , ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి మరణించినా కూడా తుది తీర్పు రాని కేసుల్లో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. అయితే , ఈ కేసు లో ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి మరణించలేదు కానీ .. తన 20 ఏళ్ల జీవితాన్ని జైల్లో ఆ నాలుగు గోడల మద్యే ప్రతి క్షణం ఓ యుగంలా బ్రతికాడు. చివరికి అతడు నిర్దోషి అంటూ కోర్టు తేల్చి జైలు నుండి విడుదల చేసింది. అయితేనేం 20 ఏళ్లు జైల్లో ఉండి , తన జీవితాన్ని కోల్పోయాను అంటూ కుమిలిపోతున్నడు.

వివరాల్లోకి వెళ్తే ... 23 ఏళ్ల వయసులో ఓ రేప్‌ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లు జైల్లో శిక్ష అనుభవించిన తర్వాత, కోర్టు దోషిగా తేల్చి 10 ఏళ్లు జైలు శిక్ష వేసింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద జీవిత ఖైదు విధించింది. అతడు హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు గత కొన్నేళ్లుగా సాగుతూనే వచ్చింది. చివరికి ఈ జనవరిలో అతడు నిర్దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అతడు బుధవారం జైలు నుంచి విడుదలయ్యాడు. చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లో ఉన్న వ్యక్తి పేరు విష్ణు తివారీ. ఉత్తరప్రదేశ్‌ లోని లలిత్‌ పూర్ అతని ఊరు‌. ప్రస్తుత వయసు 43 ఏళ్లు. విడుదల అవుతున్న క్షణంలో అతడి కళ్లలో నైరాశ్యం, దేహంలో నీరసం. జైలు నుంచి తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ రాలేదు. ‘‘ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు బయటికొచ్చి నేనేం చేయగలను. జైల్లోనే నా ఒళ్లు హూనమైపోయింది. నా కుటుంబం కూడా నాశనమైపోయింది. ఓ సోదరుడు మినహా.. నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితం జైల్లో వంట గదికే పరిమితమైపోయింది. ఈ రోజు విడుదలయ్యే నాటికి నా చేతిలో రూ. 600 మాత్రమే ఉంది అంటూ వాపోయాడు. కోర్టులో జరిగిన చిన్న తప్పు కి తన జీవితం పూర్తిగా నాశనం అయింది అంటూ వాపోతున్నాడు.