Begin typing your search above and press return to search.

చైనాను మించి భార‌త్‌లో యూనికార్నులు

By:  Tupaki Desk   |   9 Sep 2022 8:30 AM GMT
చైనాను మించి భార‌త్‌లో యూనికార్నులు
X
స్టార్ట‌ప్స్‌గా మొద‌లై ఒక బిలియ‌న్ డాల‌ర్ (భార‌త క‌రెన్సీలో రూ.8000 కోట్లు పైన‌) విలువైన యూనికార్ను కంపెనీలుగా ఎద‌గ‌డంలో భార‌త్.. చైనాను అధిగమించింది. 'హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ 2022' తాజా నివేదిక ప్ర‌కారం.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథ‌మార్థంలో మనదేశంలో 14 స్టార్ట‌ప్స్ యూనికార్న్‌ల స్థాయికి చేరాయి. ఇదే స‌మ‌యంలో చైనా 11 యూనికార్న్‌లతోనే స‌రిపెట్టుకుంది. 'హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ 2022' నివేదిక ప్ర‌కారం అమెరికా 138 యూనికార్న్‌లతో అగ్రస్థానంలో నిలిచింది. కాగా మనదేశంలో అత్యధికంగా బెంగుళూరు నుంచి 5 అంకుర సంస్థలు యూనికార్న్‌ హోదా సాధించాయి.

ఒక బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.8,000 కోట్లు) మించిన విలువ సంపాదించిన స్టార్ట‌ప్స్‌ను 'యూనికార్న్‌'లని వ్యవహరిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ప్రపంచ వ్యాప్తంగా 254 అంకుర సంస్థలు ఈ హోదా అందుకున్నాయ‌ని 'హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ 2022' వెల్ల‌డించింది.

కాగా మనదేశంలో ప్రస్తుతం 68 యూనికార్న్‌లు ఉన్నాయి. వీటిలో దాదాపు 22 బిలియన్‌ డాలర్ల విలువతో ఎడ్యుటెక్ కంపెనీ.. బైజూస్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. తదుపరి స్థానాల్లో ఫుడ్ డోర్ డెలివ‌రీ యాప్.. స్విగ్గీ (11 బిలియన్‌ డాలర్లు), డ్రీమ్‌11 (8 బిలియన్‌ డాలర్లు) ఉన్నాయి. విలువ పరంగా చూస్తే.. మనదేశానికి చెందిన బైజూస్‌ 14వ స్థానంలో, స్విగ్గీ 45వ స్థానంలో, డ్రీమ్‌11 సంస్థ 75వ స్థానంలో, ఓయో 91వ స్థానంలో నిలిచాయి.

అంతేకాకుండా భార‌త్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలు విదేశాల్లో ఏర్పాటు చేసిన స్టార్ట‌ప్స్‌లో 56 సంస్థలు సైతం యూనికార్న్ సాధించాయ‌ని 'హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ 2022' పేర్కొంది. ఇందులో 51 సంస్థలు అమెరికాలోనే ఉన్నాయి. యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే)లో 2, జర్మనీ, సింగపూర్‌, మెక్సికో దేశాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయ‌ని నివేదిక వెల్ల‌డించింది.

ఇక యూనికార్న్‌లు అత్య‌ధికంగా ఉన్న న‌గ‌రంగా అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో రికార్డు సృష్టించింది. ఈ నగరంలో 176 'యూనికార్న్‌' సంస్థలు ఉండ‌టం విశేషం. రెండో స్థానంలో 120 యూనికార్న్‌ సంస్థలతో న్యూయార్క్‌ నగరం నిలిచింది. ఇక చైనా రాజ‌ధాని బీజింగ్‌ మూడో స్థానంలో ఉంది. బీజింగ్‌లో 35 యూనికార్న్‌లు ఉన్నాయ‌ని నివేదిక పేర్కొంది. తదుపరి స్థానాల్లో షాంఘై, లండన్ న‌గ‌రాలు ఉన్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో స్టార్ట‌ప్స్ సంస్థల విలువలు బాగా క్షీణించాయ‌ని హురున్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. దీంతో కొన్ని సంస్థలు తమ యూనికార్న్‌ హోదాను కోల్పోయాయ‌ని పేర్కొంది. గత ఆరు నెలల కాలంలో దాదాపు 147 యూనికార్న్‌ సంస్థల విలువ తగ్గిపోయినట్లు వివ‌రించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.