Begin typing your search above and press return to search.

ఏపీలో మ‌రో వివాదం: స‌చివాల‌య ఉద్యోగుల‌కు యూనిఫాం!

By:  Tupaki Desk   |   19 Feb 2022 3:30 AM GMT
ఏపీలో మ‌రో వివాదం: స‌చివాల‌య ఉద్యోగుల‌కు యూనిఫాం!
X
ఏపీ స‌చివాల‌యాలు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం విప్ల‌వాత్మ‌కంగా భావిస్తున్న స‌చివాల‌యాల్లో వినూత్న నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. అయితే.. ఇవి వివాదంగా మారుతున్నాయి. స‌చివాలంలో నియ‌మితులైన‌.. మ‌హిళా సెక్ర‌ట‌రీల‌ను అనూహ్యంగా పోలీసు డిపార్ట్‌మెంట్లోకి తీసుకున్నారు.

ఇదితీవ్ర వివాదంగా మారి.. కోర్టు వ‌ర‌కు వెళ్లింది. ఇది కొన‌సాగుతుండ‌గానే .. ఇప్పుడు మ‌రో వివాదం.. ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది. ప్ర‌భుత్వం కొత్త‌గా స‌చివాల‌య ఉద్యోగుల‌కు డ్ర‌స్ కోడ్ తీసుకువ‌చ్చింది.

సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటికే ఏఎన్ఎం కి వైట్ డ్రస్ ఉంది, కరెంటు డిపార్ట్ మెంట్ వారికి వేరే యూనిఫామ్ ఉంది. మహిళా పోలీసులకు ఇటీవల ఖాకీ యూనిఫామ్ ఇస్తున్నారు. వీరు కాకుండా మిగిలినవారందరికీ ఇటీవల యూనిఫామ్ క్లాత్ కూడా పంపిణీ చేశారు.

స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా అట్టహాసంగా పంచిపెట్టారు. కుట్టుకూలీ ఇస్తామని చెప్పి మరీ పంపించారు. జీతాలు పెంచాలని అడిగితే, ప్రొబేషన్ ని వెనక్కి నెట్టి.. ఇలా చేతిలో యూనిఫామ్ పెట్టారని ఉద్యోగులు ఆవేద‌న‌ వ్య‌క్తం చేస్తున్నారు.

సచివాలయాలు ఓకే, అందులో సౌకర్యాలు ఓకే, మరి యూనిఫామ్ తో కొత్తగా ఒరిగేదేముందనేది ఉద్యోగుల ప్రశ్న, నిజంగానే యూనిఫామ్ తో ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుంది.. అనుకుంటే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి కూడా యూనిఫామ్ పెట్టండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

మొత్తమ్మీద సచివాలయం స్టాఫ్ మాత్రం యూనిఫామ్ వద్దంటున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఒత్తిడి తేగలదా..? బయోమెట్రిక్ హాజరు లేకపోతే జీతం కట్ చేస్తాం అనొచ్చు. యూనిఫామ్ వేసుకు రాకపోతే జీతం కోసేస్తామని చెబితే అది ప్రభుత్వానికే పరువు తక్కువ.

ఇదిలావుంటే.. మ‌రోవైపు... స‌చివాల‌య ఉద్యోగుల‌కు యూనిఫాం పెట్టడంపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సీఎంకు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కూడా యూనిఫాం పెడ‌తారా? అంటూ.. కామెంట్లు వ‌స్తున్నాయి.

ఏదేమైనా.. ఎన్న‌డూ లేని విధంగా వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై విమ‌ర్శ‌ల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.