Begin typing your search above and press return to search.

ఒక బడ్జెట్ కాపీ ప్రింటింగ్ ఖర్చు ఎంతంటే..

By:  Tupaki Desk   |   1 Feb 2017 9:52 AM IST
ఒక బడ్జెట్ కాపీ ప్రింటింగ్ ఖర్చు ఎంతంటే..
X
మరో బడ్జెట్ వచ్చేసింది. యావత్ దేశాన్నిప్రభావితం చేసే సాధారణ బడ్జెట్ ను ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ కు చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి.. ఎప్పటిలా కాకుండా..ఈసారి చాలా ముందుగా బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. ఇక.. బడ్జెట్ ప్రవేశ పెట్టటం మొదలు పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ రైల్వే.. సాధారణ బడ్జెట్ లను వేర్వేరుగా ప్రవేశ పెట్టటం ఒక సంప్రదాయంగా ఉంది. అందుకు భిన్నంగా ఈసారి రెండింటిని కలిపి ఒకే బడ్జెట్ గా ప్రవేశ పెట్టనున్నారు.

బడ్జెట్ తయారీ.. సమర్పణకు కొన్ని నెలల ముందే భారీ కసరత్తు జరుగుతుంది. బడ్జెట్ రోజు విత్తమంత్రి బడ్జెట్ ప్రతిపాదనను పార్లమెంటులో ప్రవేశ పెడతారు. వీటిపై చర్చ జరిపి.. తర్వాత ఆమోదిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బడ్జెట్ తయారీ సందర్భంగా సభ్యులకు.. మీడియా సభ్యులకు.. కొందరి ముఖ్యులకు బడ్జెట్ కాపీల్ని అందచేస్తుంటారు. కొద్దికాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖవెబ్ సైట్లోను బడ్జెట్ డిజిటల్ కాపీని ఉంచుతున్నారు. అయితే.. బడ్జెట్ కాపీల ముద్రణకు భారీగా ఖర్చుఅవుతోంది. గత ఏడాది బడ్జెట్ కాపీ ప్రచురణకు ఒక్కొక్క దానికి రూ.3450 అయ్యింది. మొత్తం 2047 కాపీల్ని ముద్రించారు.ఏడాది వ్యవధిలో పెరిగిన ఖర్చుతో పోల్చినప్పుడు మరింత ఖర్చు భారం పెరగటం ఖాయం. ఇలా రూ.3450ఖర్చుతో తయారు చేసిన బడ్జెట్ కాపీల్ని లోక్ సభా కౌంటర్ లో సబ్సిడీ కింద రూ.1500లకు అమ్మారు. దీంతో.. ఈ ఏడాది బడ్జెట్ కాపీల ముద్రణను భారీగా తగ్గించాలని నిర్ణయించారు. కేవలం 788 కాపీలను మాత్రము ప్రచురించాలని నిర్ణయించారు. వీటిల్లో 543 కాపీలను లోక్ సభ సభ్యులకు.. 245 కాపీలను రాజ్యసభ సభ్యులకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సభ్యులకు మినహా.. మరెవరికీ బడ్జెట్ కాపీలు అందే అవకాశం లేదు.వీరంతా.. బడ్జెట్ ప్రతుల్ని డిజిటల్ వెర్షన్ ను చూసుకునే అవకాశం ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/