Begin typing your search above and press return to search.

జైట్లీ బ‌డ్జెట్ లో ఏం చెప్పారు..?

By:  Tupaki Desk   |   1 Feb 2018 6:24 AM GMT
జైట్లీ బ‌డ్జెట్ లో ఏం చెప్పారు..?
X
అనుకున్నట్లే.. ఈ రోజు (గురువారం) ఉద‌యం 11 గంట‌ల వేళ‌లో పార్ల‌మెంటులో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టారు. కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగ ప‌త్రాల్ని స‌ర్దుకున్నారు. స్పీక‌ర్ అనుమ‌తించిన కొద్ది సెక‌న్ల‌లోనే జైట్లీ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని షురూ చేశారు. స‌రిగ్గా ఈ ఉద‌యం 11.02 గంట‌ల‌కు జైట్లీ త‌న ఆఖ‌రి బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. త‌న‌కు ఎడ‌మ‌వైపు బీజేపీ పెద్ద‌దిక్కు అద్వానీ.. కుడివైపు మ‌రో కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కూర్చున్నారు.

త‌న ప్ర‌సంగంలో తొలుత త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డటానికి ముందు ఏం చెప్పామో.. తాము అవ‌న్నీ చేస్తున్న‌ట్లు చెప్పారు. మోడీ హ‌యాంలో త‌మ ప్ర‌భుత్వం దేశాన్ని అభివృద్ధి ప‌థంలోకి దూసుకెళ్లేలా చేసింద‌న్న మాట‌ను చెప్పుకున్నారు. త‌న మాట‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌న్న‌ట్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భార‌త్ తొలిసారి టాప్ 100లోకి వ‌చ్చేసింద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో మొద‌టి అర‌గంట‌ను ప‌రిశీలిస్తే..వ్య‌వ‌సాయానికి.. గ్రామీణ ప్రాంతాల‌కు.. గిరిజ అభివృద్ధి.. మ‌హిళ‌ల‌కు స‌బ్సిడీ మీద ఇచ్చే గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కంపై దృష్టి సారించార‌ని చెప్పాలి. గ‌డిచిన నాలుగేళ్లలో త‌మ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల్ని ఏక‌రువు పెట్టారు. జీఎస్టీ.. పెద్ద‌నోట్ల ర‌ద్దును స‌మ‌ర్థించుకున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దుతో ద్ర‌వ్య వినియోగం భారీగా పెరిగింద‌ని చెప్పుకున్నారు.

దేశాభివృద్ధి కోసం సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని చెప్పామ‌ని.. అందుకు త‌గ్గ‌ట్లే పాలిస్తున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతం భార‌త్ 2.5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తీర్చిదిద్దిన‌ట్లు చెప్పారు. ముందుగా వినిపించిన అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే రైతుల విష‌యాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించ‌టంతో పాటు.. స‌రికొత్త హామీని తెర మీద‌కు తీసుకొచ్చారు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింత‌లు చేయాల‌న్న ఆశ‌యంతో ఉన్నామ‌న్నా జైట్లీ.. అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు చెప్పారు. మోడీ సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక‌వృద్ధి రేటు మెరుగు ప‌డింద‌న్నారు. ప్ర‌పంచంలో ఏడో ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారిన‌ట్లు చెప్పిన జైట్లీ.. రానున్న రోజుల్లో ఐదో స్థానానికి ఎద‌గ‌ట‌మే త‌మ ల‌క్ష్యంగా చెప్పారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న‌ట్లు చెప్పారు. వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మార్చాల‌ని.. రైతులు పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌ను అందించ‌ట‌మే త‌మ ఉద్దేశంగా చెప్పారు. సేంద్రీయ వ్య‌వ‌సాయానికి ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌న్నారు.

ఆప‌రేష‌న్ గ్రీన్ కోసం రూ.500 కోట్లు కేటాయించిన జైట్లీ.. సేంద్రీయ వ్య‌వ‌సాయాన్ని చేసే మ‌హిళా సంఘాలకు ప్రోత్సాహాం అందిస్తున్న‌ట్లు చెప్పారు. రైతులు సోలార్ ప‌రిక‌రాలు అందేలా చేస్తామ‌న్నారు. రైతుల నుంచి సోలార్ విద్యుత్ ను కొనుగోలు చేస్తామ‌న్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామ‌ని.. ఇందుకోసం ప‌థ‌కాల్ని వారికే నేరుగా అందేలా చేశామ‌న్నారు. గ్రామీణ వ్య‌వ‌సాయ మార్కెట్ల‌కు రూ.2వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం రూ.1400 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు చెప్పిన ఆయ‌న 42 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌ను నెల‌కొల్ప‌ట‌మే ల‌క్ష్య‌మ‌న్నారు. రైతుల ఉత్పాద‌క‌త‌ను పెంచేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు.