Begin typing your search above and press return to search.

బాబుకు కేంద్రం కౌంట్ డౌన్..పెంట‌పాటికి లేఖే నిద‌ర్శ‌న‌మా?

By:  Tupaki Desk   |   1 July 2019 6:08 AM GMT
బాబుకు కేంద్రం కౌంట్ డౌన్..పెంట‌పాటికి లేఖే నిద‌ర్శ‌న‌మా?
X
వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్న ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌రో షాక్ కు రంగం సిద్ధ‌మ‌వుతుందా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. పోల‌వ‌రం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకున్న‌ట్లుగా ఆరోప‌ణలు వెల్లువెత్త‌టం తెలిసిందే. దీనిపై సామాజికవేత్త పెంట‌పాటి పుల్లారావు ఇటీవ‌ల కేంద్రానికి ఒక లేఖ రాశారు. పోల‌వ‌రం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు.

తాజాగా ఈ లేఖ‌పై కేంద్రం స్పందించింది. పోల‌వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగింద‌ని ఫిర్యాదు చేసింది మీరేనా? అంటూ ప్ర‌శ్నిస్తూ ఒక తిరుగు లేఖ రాసింది. మీరే ఆరోప‌ణ‌ల లేఖ రాసిన‌ట్లుగా క‌న్ఫ‌ర్మ్ చేయాలంటూ కేంద్ర జ‌ల‌వ‌న‌రుల మంత్రిత్వ శాఖకు చెందిన‌ నిఘా విభాగం ప్ర‌శ్నించింది. అంతేకాదు.. మీరు చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు ఇస్తారా? ద‌ర్యాప్తు అధికారికి స‌హ‌క‌రించ‌టానికి మీరు సిద్ధ‌మా? ఒక‌వేళ ఆరోప‌ణ‌లు నిరూపించ‌లేని ప‌క్షంలో చ‌ట్ట‌ప్ర‌కారం మీపై ప్రాసిక్యూష‌న్ చేయాల్సి ఉంటుంది.. అందుకు మీరు సిద్ధ‌మా? అంటూ లేఖ‌లో ప్ర‌శ్నించింది.

కేంద్రం నుంచి వ‌చ్చిన లేఖ‌పై పెంట‌పాటి పుల్లారావు రియాక్ట్ అయ్యారు. కేంద్రానికి లేఖ రాసింది తానేన‌ని.. పోల‌వ‌రం ప్రాజెక్టులో అవినీతిని నిరూపించ‌టానికి తాను సిద్ధంగా ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ తాను కానీ అవినీతిని నిరూపించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌ని ఆయ‌న చెప్పారు. పోల‌వ‌రం మీద కేంద్రం దృష్టి సారించ‌టం.. అందుకు త‌గిన ఆధారాల్ని ప‌రిశీలించ‌టం షురూ కావ‌టం చూస్తే.. రానున్న రోజుల్లో బాబుకు కొత్త క‌ష్టాలు షురూ కానున్న‌ట్లే అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.