Begin typing your search above and press return to search.

కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   4 March 2020 9:15 AM GMT
కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన
X
రోజురోజుకు కరోనా బాధితులు పెరుగుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్న బాధతులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. మొదట కేరళలో తొలి పాజిటివ్ కేసు నమోదు కాగా తెలంగాణలోని హైదరాబాద్ లో, ఢిల్లీలో చెరో ఒక పాజిటివ్ రావడంతో దేశం ఉలిక్కిపడింది. ఇక అప్పటి నుంచి కరోనా కల్లోలం భారతదేశాన్ని చుట్టుముట్టింది. తాజాగా ఈ కరోనా వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు భారతదేశంలో కరోనా బాధతులు 28 అని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు 28 మందికి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) సోకినట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ బుధవారం ఢిల్లీలో వెల్లడించారు.

కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. అయితే అతడి వలన ఆగ్రాలో ఉన్న అతడి కుటుంబసభ్యులు ఆరుగురికి కూడా వైరస్‌ సోకిందని వివరించారు. దీంతో పాటు దేశంలో పర్యటిస్తున్న 21 మంది ఇటలీ దేశీయుల్లో 16 మంది కరోనా బారిన పడ్డారు. వారిని చావ్లాలో ఉన్న ఇండో- టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించారు.

ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 5,89,000 వేల మందికి ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్‌ నిర్వహించారు. నేపాల్‌ సరిహద్దులో సైతం స్క్రీనింగ్‌ సెంటర్లు ఏర్పాటుచేశారు. కరోనా తీవ్ర రూపం దాల్చడంతో ఇప్పటి నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికి స్క్రీనింగ్‌ తప్పనిసరి చేసినట్లు స్పష్టం చేశారు. విదేశాల్లో ఉండి కరోనా సోకినట్లుగా అనుమానిస్తున్న భారత పౌరుల విషయమై స్పందించారు. ఇరాన్‌ సహకరిస్తే అక్కడ ల్యాబ్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వారిని స్క్రీనింగ్‌ చేసి అనంతరం భారత్‌కు రప్పించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల ధర పెంచితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా దుకాణదారులకు, వ్యాపారులకు హెచ్చరించారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ కరోనా ప్రభావం హోలీ వేడుకలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.

కేంద్రమంత్రి ప్రకటించిన లెక్కల ప్రకారం కరోనా బాధితులు ఈ విధంగా ఉన్నారు.
మొత్తం పాజిటివ్ కేసులు 28
ఢిల్లీ -1
తెలంగాణ-1
ఆగ్రా- 6
కేరళ- 3
16 మంది ఇటాలియన్‌ పర్యాటకులు. వీరితో పాటు వీర వెంట ఉన్న డ్రైవర్‌ (భారతీయుడు)