Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలలో అమిత్ షా పులిహోర పాలిటిక్స్

By:  Tupaki Desk   |   21 Aug 2022 9:18 AM GMT
తెలుగు రాష్ట్రాలలో అమిత్ షా పులిహోర పాలిటిక్స్
X
బీజేపీ మునుపటి లాంటి పార్టీ కాదు అని ఆ పార్టీలో ఉన్న వారే చెబుతున్నారు. అటల్ బిహారీ వాజ్ పేయ్, అద్వానీల శకం అక్కడ ఏనాడో ముగిసింది. ఇపుడు మోడీ అమిత్ షాల జమానా సాగుతోంది. ఇదిలా ఉంటే కాదేదీ అనర్హం తరహాలో మోడీ షా ఇద్దరూ అధికారమే పరమావధిగా రాజకీయాలు నడుపుతారు అన్నది ఎనిమిదేళ్ళ వారి పొలిటికల్ షో చూస్తే అందరికీ అర్ధమయ్యే విషయమే. తమ వారు అయినా పరవారు అయినా తమకు ప్రతిబంధకం అయితే సైడ్ కావాల్సిందే. ఇక రాజకీయాల్లో మిత్ర శతృవులు కూడా మోడీ షా ద్వయానికి లేరు.

అప్పటికి ఎవరు తమకు అవసరం పడతారో వారిని తమ వైపునకు లాగేసే రాజకీయ విద్యలో బీజేపీ పెద్దలు ఆరితేరిపోయారు. అందుకే ఇపుడు తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు వారికి కావాల్సి వస్తున్నారు. అదే టైమ్ లో మీడియా మొగ‌ల్ గా పేరున్న రామోజీరావు ఆశ్రయం కూడా కావాలనిపిస్తోంది. ఇంకో వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంచుకుని ఆయన్ని దువ్వుతూనే వీలైతే మెగాస్టార్ ని కూడా లాగాలని చూస్తున్నారు. అందుకే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేళ భీమవరంలో జరిగే సభకు ఆయన్ని కూడా పిలిచి మోడీ ముచ్చట్లు పెట్టారు.

ఇపుడు చూస్తే మళ్లీ నారా నుంచి నందమూరి ఫ్యామిలీ మీద కమలనాధుల కన్ను పడింది. ఎన్టీయార్ కి అసలు సిసలు వారసుడు అయిన జూనియర్ ఎన్టీయార్ తో అమిత్ షా భేటీ కావడం వెనక ఫక్తు రాజకీయం తప్ప మరేమీ లేదని అర్ధమవుతోంది. ఇక బీజేపీలో ఎన్టీయార్ బ్లడ్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి ఉండనే ఉన్నారు. ఇలా అటు మెగా ఫ్యామిలీ ఇటు నందమూరి ఫ్యామిలీ ఇంకో వైపు నారా ఫ్యామిలీ, ఇక మీడియా దిగ్గజం తో పాటు కలసివచ్చే శక్తులను అన్నింటినీ కలుపుకుని బీజేపీ తెలుగు రాజకీయ వంటకం వండుతోంది. అయితే అది పులిహోర అవుతుందే తప్ప మరేమీ కాదని ప్రత్యర్ధులు అంటున్నారు.

బీజేపీకి తొందరగా తెలంగాణా పీఠం ఎక్కాలని ఉంది. ఏపీలో అధికారంలో వాటా తీసుకోవాలని ఉంది. అయితే ఏపీలో వైసీపీ నమ్మకమైన మిత్రపక్షంగా ఉంది. ఆ పార్టీ వచ్చే ఎన్నికల తరువాత కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడం ఖాయమే. మరో ఆల్టర్నేషన్ కూడా వైసీపీకి లేదు. ఇక తెలంగాణాలో తన దారిన తాను వెళ్తే బీజేపీకి ఈ ఎన్నికలు కాకపోయినా మరో ఎన్నికల్లో అయినా చాన్స్ ఉంటుంది. కానీ తొందర మరీ ఎక్కువైపోయిన బీజేపీ తెలుగు రాష్ట్రాలను రెండింటినీ ఒకేసారి గుప్పిట పట్టాలని చేస్తున్న ఈ రాజకీయం పూర్తిగా వికటించే అవకాశాలే ఎక్కువ అంటున్నారు.

ఈ నేపధ్యంలో బీజేపీని ప్రజలు నమ్మడం పక్కన పెడితే ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు కూడా నమ్మే స్థితి లేకుండా చేసుకోవడం కనుక జరిగితే మరో పుష్కర కాలం దాకా కమల రెపరెపలు రెండు చోట్లా కనిపించే అవకాశాలు కూడా ఉండవనే అంటున్నారు. ఈ కలగూరగంప రాజకీయాలను బీజేపీ చేస్తూ తాను చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నాను అనుకుంటే పొరపాటే అని అంటున్నారు.