Begin typing your search above and press return to search.

ఈటల ఎపిసోడ్ పై బీజేపీ నేతలకు క్లాస్ పీకిన అమిత్ షా

By:  Tupaki Desk   |   18 Sep 2022 5:45 AM GMT
ఈటల ఎపిసోడ్ పై బీజేపీ నేతలకు క్లాస్ పీకిన అమిత్ షా
X
తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్న మోడీషాలు.. తెలంగాణలో జరిగే ప్రతి విషయాన్ని ఎంత నిశితంగా చూస్తున్నారన్న దానికి నిదర్శనంగా తాజాగా అమిత్ షా పర్యటన తేటతెల్లం చేసింది. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ.. సీఎం కేసీఆర్ గురించి తెలుసుకుంటూ.. బీజేపీనేతలు చెప్పే మాటల ద్వారా ఆయన బలం.. బలహీనతల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో అమిత్ షా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు.. తాను గుర్తించిన అంశాల్ని సైతం ప్రస్తావిస్తూ.. క్రాస్ చెక్ చేసున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పెద్దగా రచ్చ కాలేదు కానీ.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అవసరం లేకున్నా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ వేటు వేశారన్న భావన ప్రజల్లో ఉన్నా.. బీజేపీ నేతల్లో మాత్రం అదేమీ కనిపించని విషయాన్ని అమిత్ షా తాజాగా గుర్తించారు. అదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతల్ని ప్రస్తావిస్తూ.. వారికి క్లాస్ పీకిన వైనం ఆసక్తికరంగా మారింది. ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ వేటు వేస్తే.. పార్టీ నేతలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ఎందుకు చేపట్టలేదు? అంటూ అమిత్ షా ఆగ్రహం పలువురు బీజేపీ నేతలు ఒళ్లు జలదరించేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.

పార్టీ కోర్ కమిటీ సభ్యులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఆయన ఈటల ఎపిసోడ్ పై క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. అమిత్ షా మాటలకు స్పందించిన నేతలు.. సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. అమిత్ షా మాత్రం వారి మాటలకు అడ్డు తగులుతూ.. 'మీరేం మాట్లాడుతున్నారు? గ్రామాలు.. మండలాలు.. జిల్లాల్లో ఎక్కడికక్కడ నిరసనలు.. ధర్నాలు చేసి ఉండాల్సింది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుతో మిగిలిన వారు కామ్ గా ఉండిపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్న విషయంపై ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు రావటం తెలిసిందే. టీ బీజేపీలో తేడాను గుర్తించిన అమిత్ షా.. తన మాటలతో చికిత్స చేసే ప్రయత్నాన్ని షురూ చేసినట్లుగా చెబుతున్నారు. ఈటల ఎపిసోడ్ పై తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంచార్ఝీలు సునీల్ బన్సల్.. తరుణ్ చుగ్ లను సైతం అమిత్ షా ప్రశ్నించటం గమనార్హం.