Begin typing your search above and press return to search.

బొమ్మ కనిపించాల్సిందే : వైసీపీకి దిమ్మతిరిగేలా కేంద్ర మంత్రి ఫైర్

By:  Tupaki Desk   |   11 Jun 2022 12:33 PM GMT
బొమ్మ కనిపించాల్సిందే : వైసీపీకి దిమ్మతిరిగేలా కేంద్ర మంత్రి  ఫైర్
X
రాష్త్రంలో బొమ్మలాట సాగుతోంది. స్టిక్కర్లాట కూడా సాగుతోంది. ఇది రాజకీయ యుద్ధంగా మారుతోంది. మా నాయకుడి బొమ్మ ఏదీ ఎక్కడ అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన నేతలు అడుగుతున్నారు. అలాగే మా పధకాలు అన్నీ వాడేసుకుంటూ వాటి మీద మీ స్టిక్కర్లు వేసేసుకుంటూ ఇదేమి రాజకీయమని ఏపీ బీజేపీ నేతలు ఎప్పటికపుడు కస్సుమంటూంటారు.

ఇపుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఏపీకి వచ్చి విజయవాడ నడిబొడ్డునే మోడీ బొమ్మ కనిపించాల్సిందే అంటూ వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మోడీ బొమ్మ లేకుండా ఆరోగ్యశ్రీ పధకమా అంటూ మండిపడ్డారు.

ఆరోగ్యశ్రీకి కేంద్రం కూడా పాక్షికంగా నిధులు ఇస్తోంది. అలాంటపుడు ఆరోగ్యశ్రీ కార్డుల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్ ల బొమ్మలు మాత్రమే ఎందుకు పెట్టారు, ప్రధాని మోడీ బొమ్మ ఏదీ ఎక్కడా అని ఆమె గద్దించారు. ఇదంతా ఆమె విజయవాడలోని ఒక ఆసుపత్రిని సందర్శించినపుడు అక్కడ ఆరోగ్యశ్రీ కార్డుల మీద మోడీ బొమ్మ లేకపోవడంతో నిలదీసిన వైనం.

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా పీఎంజెవైఏ నిధులతో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకం లోగోపై మోడీ బొమ్మ లేకపోవడం పట్ల ఆమె మండిపడ్డారు. ఇది తగదని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం నిధులు ఇస్తున్న పధకాల మీద ప్రధాని బొమ్మ లేకుండా ఎలా ఉంటుందని ఆమె అనడం విశేషమే. దీని మీద ఆమె ఏకంగా ఆరోగ్యమిత్ర హెల్ప్ డెస్క్ సిబ్బందితో కూడా మాట్లాడారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్ మీద కూడా జగన్ వైఎస్సార్ ల ఫోటోలు మాత్రమే ఉండడాన్ని తప్పుపట్టారు.

ఆరోగ్యశ్రీ పధకానికి కేంద్రం నిధులు ఇస్తున్న సంగతి మీకు తెలుసా అని ఆమె అక్కడ వారిని నిలదీశారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుదారులకు అందిస్తున్న వైద్య సేవలకు సంబంధించి ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మొత్తానికి ఆరోగ్యశ్రీ మీద ప్రధాని బొమ్మ లేకపోవడం పట్ల ఆమె ఫైర్ అయ్యారు. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

ఇక అంతకు ముందు చూస్తే తాజాగా ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆరోగ్యశ్రీ కేంద్ర పధకమే అని ప్రకటించారు. మరి కేంద్ర పధకాల మీద మోడీ బొమ్మ లేకపోతే చూస్తూ ఊరుకోమని అంటునారు. చూడబోతే ఈ బొమ్మల రాజకీయం చిలికి చిలికి గాలి వానగా మారేట్టుగా ఉంది అంటున్నారు.