Begin typing your search above and press return to search.

పెట్రోల్ ధరల పెంపుపై ఒళ్లు మండే మాటలు చెప్పిన కేంద్ర మంత్రి

By:  Tupaki Desk   |   8 Jun 2021 1:35 PM GMT
పెట్రోల్ ధరల పెంపుపై ఒళ్లు మండే మాటలు చెప్పిన కేంద్ర మంత్రి
X
గతం సంగతి ఏమో కానీ.. ఇవాల్టి రోజున దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటానికి కారణం ఏమిటన్న విషయాన్ని అడగాలే కానీ.. చిన్నపిల్లాడు కూడా చెప్పేసే పరిస్థితి. దేశ చరిత్రలో తొలిసారి లీటరు పెట్రోల్ ధరను సెంచరీ దాటించిన ఘనత కేంద్రంలోని మోడీ సర్కారుదే. గడిచిన నెలలో 20 రోజులు ధరను పెంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్.. డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న వైనంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రోజువారీగా పది పైసలు.. ఇరవై పైసలు అంటూ పెంచుకుంటూ పోయి.. ఈ రోజుకు సెంచరీ దాటించేసిన మోడీ ప్రభుత్వ తెలివికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

లీటరు పెట్రోల్ ధరలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను ఎంత ఎక్కువగా ఉందన్న విషయం అందరికి అర్థమైన తర్వాత కూడా.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు వింటే ఒళ్లు మండాల్సిందే. గుజరాత్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటానికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగటమేనని చెప్పారు.

ప్రస్తుతం ముడిచమురు బ్యారెల్ ధర 70 డాలర్లుగా ఉందని.. మన అవసరాలకు 80 శాతం దిగుమతి చేసుకోవటంతో ఇప్పుడున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇంధన ధరల్ని జీఎస్టీలోకి తీసుకొస్తే ధర భారీగా తగ్గటంతో పాటు.. భారం తగ్గే వీలుంది. అయితే.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయాన్నికోల్పోతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాల్ని నడిపిస్తోంది పెట్రోల్.. డీజిల్ మీద పన్ను ఆదాయంతో పాటు ఎక్సైంజ్ ఆదాయం కూడా. అలాంటప్పుడు జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశమే లేదు. అయితే.. పెట్రోల్.. డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గే అవకాశం ఉందన్న మాటను తానుకూడా అంగీకరిస్తున్నట్లు చెప్పారు.

ధరల భారం గురించి ఒప్పుకుంటూనే.. ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించకుండా.. పులిహోర తిప్పేసినట్లుగా నాలుగు మాటలు చెప్పి వెళ్లిన కేంద్రమంత్రి వారి మాటలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో ధరలు పెరగటానికి అంతర్జాతీయ మార్కెట్లోని ధరలుగా చెప్పిన వైనం విన్నంతనే కోపం కలిగించేలా ఉంటుంది. అందరికి అవగాహన ఉన్న అంశం పైనా ప్రజల్ని తప్పుదారి పట్టించేలా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాటలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. పెట్రోల్ ధరలు ఇప్పట్లో తగ్గవన్న సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లే అన్న మాట వినిపిస్తోంది.