Begin typing your search above and press return to search.

తాయిలాలు ఇవ్వడానికి అప్పులు చేయకూడదు!

By:  Tupaki Desk   |   29 Oct 2022 10:38 AM GMT
తాయిలాలు ఇవ్వడానికి అప్పులు చేయకూడదు!
X
ప్రజలకు తాయిలాలు ఇవ్వడానికి అప్పులు చేయకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె జగన్‌ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారని అంటున్నారు.

ఆస్తులు సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి అప్పులు చేయొచ్చన్నారు. అయితే పాత అప్పులకు వడ్డీలు కట్టడానికి, ప్రజలకు తాయిలాలు పంచడానికి అప్పులు చేయకూడదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు.

అభివృద్ధికి అడ్డంకులు కలిగేలా ఉచితాలు ఇవ్వడం సమర్థనీయం కాదన్నారు. ఇలాంటి చర్యలు సుపరిపాలన అనిపించుకోవని స్పష్టం చేశారు. ప్రజలకు ఏమైనా ఉచితంగా ఇచ్చే ముందు.. అవి ఇవ్వడానికి ఆదాయ మార్గాలు ఉన్నాయా? లేవా? అనేది చూసుకోవాలన్నారు. బడ్జెట్లో కేటాయింపులు చేసుకోగలమా? లేదా అన్నది కూడా ముఖ్యమేనన్నారు. ఆ తర్వాత ఉచితాలకు సంబంధించి అసెంబ్లీ ఆమోదం కూడా పొందాలని తెలిపారు.

వివిధ పథకాలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతోందని గతంలో దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి బాధపడ్డారని నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు. ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం అలా బాధపడే వ్యక్తి కాదని తెలిపారు. రూపాయి వెచ్చిస్తే ఆ రూపాయి వంద శాతం ప్రజలకు చేరాలని ప్రధాని మోదీ కోరుకుంటారని తెలిపారు. ఇందుకే ఆయన ప్రధాని అయిన వెంటనే జన్‌ధన్‌ ఖాతాలను తెరిపించి ప్రభుత్వ పథకాల నిధులన్నీ వారి ఖాతాల్లో నేరుగా జమయ్యేలా చేస్తున్నారని గుర్తు చేశారు.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్లను తలచుకుంటే తనకు ముందుగా ఎన్టీఆర్‌ మాత్రమే గుర్తుకు వస్తారని నిర్మలా సీతారామన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తనకు ఎప్పుడు ఛాన్స్‌ దొరికినా ఎన్టీఆర్‌ సినిమాలే చూసే దాన్నని తెలిపారు. పురాణాల్లోని అంశాలను తెలుసుకోవాలనుకుంటే బంధువులు, కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ సినిమాలు చూసి ఆనందించేవాళ్లమని చెప్పారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తగిన చర్యలు తీసుకోకపోతే ఏపీ కూడా శ్రీలంకలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోక తప్పదని పలువురు నిపుణులు, ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు కూడా జగన్‌ ప్రభుతాన్ని ఉద్దేశించేనని భావిస్తున్నారు. ఆమె నేరుగా పేరు పెట్టి జగన్‌ ప్రభుత్వాన్ని అనకపోయినా పరోక్షంగా మాత్రం ఆమె వ్యాఖ్యలు జగన్‌ను ఉద్దేశించేనని అంటున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.