Begin typing your search above and press return to search.

టెండర్ల రద్దుపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   3 Aug 2019 7:19 AM GMT
టెండర్ల రద్దుపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
X
మంచి చేసిన వారిని ప్రోత్సహించటం ఎక్కడైనా ఉంటుంది. అందుకు భిన్నమైన వాతావరణం మోడీ సర్కారులో కనిపిస్తోంది. బాబు హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల టెండర్లలో భారీ ఎత్తున అవినీతి.. అవకతవకలు చోటు చేసుకున్న విషయం వెల్లడవుతున్న వైనం తెలిసిందే. ఇలాంటి వేళ.. చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కారు తీరును తప్పు పట్టేలా కేంద్రం స్పందిస్తున్న తీరు ఇప్పుడు షాకింగ్ గా మారుతోంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చు తగ్గుతుందని నిపుణులు చెబుతుంటే.. అందుకు భిన్నంగా రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు ఖర్చు పెరుగుతుందన్న సిత్రమైన వాదనను వినిపిస్తున్నారు కేంద్రమంత్రి.

ఏపీ ప్రత్యేక హోదాతో పాటు.. ఏపీ ప్రయోజనాల మీద వైఎస్ సర్కారు రాజీ లేని పోరాటం చేస్తున్న వైనం తెలిసిందే. ఈ తీరును జీర్ణించుకోలేకపోతున్న కేంద్రం.. తనకు అవకాశం చిక్కిన ప్రతిసారీ ఏదోలా ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రోగ్రాంకు తెర తీయటం కనిపిస్తుంది. ఇదేతీరును తాజాగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లలో ఒకరైన నవయుగకు ఇచ్చిన టెండర్లను రద్దు చేయటాన్ని కేంద్రమంత్రి తప్పు పట్టటం గమనార్హం.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వారి అనుమానాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రజాధనం వేస్ట్ కాకూడదన్నజగన్ ప్రభుత్వ పాలసీని ఏదోలా తప్పు పట్టాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. రివర్స్ టెండర్ల ద్వారా.. అప్పటికే నిర్ణయించే మొత్తం కంటే తక్కువ మొత్తానికే టెండర్ కేటాయింపులు జరుగుతాయి. అందుకు భిన్నంగా ఆయన చెప్పేదేమంటే.. రివర్స్ టెండర్ల కారణంగా ఖర్చు పెరుగుతుందని.. ప్రాజెక్టు ఆలస్యమవుతుందని చెప్పటం గమనార్హం.

జగన్ మీద కోపంతో కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలకు బాబు అనుకూల మీడియా చెలరేగిపోతూ.. జగన్ సర్కార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలన్నట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది. జగన్ తీసుకుంటున్న ప్రజాదరణ నిర్ణయాలతో ఏపీ ప్రజల్లో ఆయనకు ఆదరణ అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కేంద్రం బూచిని చూపించి దెబ్బ తీయాలన్నట్లుగా వ్యవహరించటం కనిపిస్తోంది.

ఇక.. రివర్స్ టెండర్ల పై కేంద్రమంత్రి అనుమానాల్ని చూస్తే.. అందులో ఒకటి ఖర్చు పెరగటం.. మరొకటి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి కాదన్నది. ఈ రెండింటిని అధిగమించేందుకు వీలుగా జగన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసుకుంటే.. దాన్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఏపీకి మంచి చేయాలన్న దాని కంటే.. తమ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నట్లుగా కేంద్రమంత్రి తీరు ఉందన్న విమర్శ వినిపిస్తోంది.