మోడీ ఫొటో లేకపోవడంతో కలెక్టర్ పై మండిపడ్డ కేంద్రమంత్రి నిర్మలా.. ఇదేందయ్యా? ఇదీ?
By: Tupaki Desk | 2 Sep 2022 10:42 AM GMTకేంద్ర ఆర్థిక మంత్రి.. దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తి ఆమె.. అలాంటి నిర్మలా సీతారామన్ తెలంగాణలో పర్యటించారు. కామారెడ్డి జిల్లాలో కేంద్రప్రభుత్వం నిర్ణయించిన ప్రవాస్ యోజన కార్యక్రమం తీరుతెన్నులు తెలుసుకున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో రెండో పర్యటన సందర్భంగా ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పై మండిపడడం చర్చనీయాంశమైంది. ఆమె ఆవేశానికి కారణం.. దేశ ప్రధాని మోడీ ఫొటో లేకపోవడమేనట..?
కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ లో శుక్రవారం రేషన్ షాప్ ను తనిఖీ చేయడానికి వెళ్లిన నిర్మలా సీతారామన్ రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను ప్రశ్నించారు. దానికి కలెక్టర్ తనకు తెలియదని సమాధానమిచ్చారు. కలెక్టర్ అయ్యిండి తెలియదంటారా? అంటూ నిర్మల ఫైర్ అయ్యారు. అరగంటలో తెలుసుకొని చెప్పాలని కలెక్టర్ ను ఆదేశించారు. రెండో రోజు పర్యటనలోనూ అడుగడుగునా నిర్మలా సీతారామన్ కలెక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు.
రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్రం వాటా ఎంటో తెలియకుండా పనిచేస్తున్నారని కలెక్టర్ ను కేంద్ర మంత్రి నిర్మల వాయించారు. ఒక ఐఏఎస్ అయ్యుండి మీరు తెలుసుకోకుండా ఎలా ఉన్నారు? అంటూ నిర్మల నిలదీశారు. అరగంట టైం ఇస్తాను తెలుసుకొని చెప్పమని కలెక్రట్ కు మంత్రి నిర్మల ఆదేశించారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంపై కిలోకు రూ.35 ఖర్చు అవుతోందని.. కేంద్రం ప్రభుత్వం అందులో 30 రూపాయలు భరిస్తోందని నిర్మల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం భరించకున్నా.. మోడీ కేంద్రం పేరు లేకుండా తన పేరు ప్రచారం చేసుకుంటోందని నిర్మల ఆవేదన చెందారు.
రేషన్ షాప్ లో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడం గమనించిన కేంద్రమంత్రి నిర్మల.. మీరు మోడీ ఎందుకు పెట్టలేదని కలెక్టర్ ను నిలదీశారు. ప్రధాని మోడీ ఫొటో మీరు పెట్టకపోతే తానే స్వయంగా వచ్చి ప్రధాని మోడీ ఫొటో పెట్టి వెలతాను అంటూ నిర్మలా స్పష్టం చేశారు.
కేంద్రం ఏం ఇవ్వడం లేదని.. అంతా మేమే ఇస్తున్నామన్న లెవల్ లో నిర్మల తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఇది రాజకీయ యాత్రలా మారిపోయింది. సంక్షేమ పథకాల పేరుతో కలెక్టర్లను టార్గెట్ చేయడం ఏంటని ఐఏఎస్ లు మండిపడుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ పంచాయితీ బయట చూసుకోవాలని.. ఇలా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేయడంలో భాగంగా కలెక్టర్ ను బలిపశువును చేయడం ఏంటని నిలదీశారు. కేంద్ర రాష్ట్ర పథకాలు అమలు చేసే బాధ్యత మాత్రమే కలెక్టర్లదని.. అందులో పావలా, రూపాయి ఎవరిచ్చారని కొలవడానికి కాదని ఉన్నతాధికారులు హితవు పలుకుతున్నారు.
రేషన్ షాపుల్లో మోడీ ఫొటో పెట్టాలన్న నిర్మల వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. అలా అయితే దేశాన్ని పోషిస్తున్న తెలంగాణ నుంచి మూడున్నర లక్షల కోట్లు కేంద్రం తీసుకుంటోందని.. ఇలా అయితే కేసీఆర్ ఫొటోలు కూడా తమ డబ్బులు ఖర్చు చేస్తున్న చోట్ల పెట్టాలంటూ హరీష్ కౌంటర్ ఇచ్చారు. నిర్మల సీతారామన్ తీరుపై కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు దిగడం ఉద్రిక్తంగా మార్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.