Begin typing your search above and press return to search.

కేసీఆర్ తప్పుల చిట్టా ఓపెన్ చేసిన కేంద్ర మంత్రి నిర్మలమ్మ

By:  Tupaki Desk   |   2 Sep 2022 7:31 AM GMT
కేసీఆర్ తప్పుల చిట్టా ఓపెన్ చేసిన కేంద్ర మంత్రి నిర్మలమ్మ
X
తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయం పుణ్యమా అని.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమదే అధికారమని నమ్మకంగా ఉన్న బీజేపీ.. అందుకు తగ్గట్లుగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది.

తెలంగాణ డెవలప్ మెంట్ చేస్తున్న వైనాన్ని ఏకరువు పెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు భిన్నంగా బీజేపీ నేతలు గులాబీ బాస్ వైఫల్యాల్ని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా తెలంగాణలో కేసీఆర్ పాలనలోని తప్పుల్ని ఎత్తి చూపించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

తెలంగాణలో ప్రతి పుట్టే బిడ్డ తల మీద రూ.1.25 లక్షల అప్పు ఉందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. కేంద్రం అమలు చేసే పథకాల పేర్లను మారుస్తున్నట్లుగా చెప్పారు. కేంద్రం ఒక పేరు పెడితే దానికి తెలంగాణ రాష్ట్రం మరో పేరు పెడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.20 లక్షల కోట్లకు పెంచినట్లుగా మండిపడ్డ నిర్మలమ్మ.. ప్రాజెక్టుల వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచారన్నారు. మన ఊరు - మన బడి కేంద్రం పథకమైతే దాన్ని రాష్ట్ర స్కీంగా క్లెయిమ్ చేసుకుంటున్నట్లు చెప్పారు.

ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం చేరటం లేదని.. తెలంగాణలో ప్రతి వంద మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారని.. ఫసల్ బీమా యోజన ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.

రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నట్లుగా చెప్పారు. రూ.లక్ష రుణమాఫీని ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించినఆయన.. రైతు బీమా కౌలు రైతులకు ఎందుకు ఇవ్వరు? పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నారే తప్పించి వాటిని అమలు చేయటం లేదన్నారు. మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు లోటు బడ్జెట్ గా మారిందన్నారు.

కేసీఆర్ సర్కారు బయట చేసే అప్పుల్ని చాలావరకు చూపించటం లేదన్నారు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని.. ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని తెలంగాణ రాష్ట్రం దాటేసిందన్నారు. 'దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి మీరు సమాధానం చెప్పండి. లిక్కర్ స్కాంలో ఎవరి మీద ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం ఇవ్వాలన్నారు. మొత్తంగా కేసీఆర్ సర్కారు చేస్తున్న తప్పుల్ని.. కళ్లకు కట్టినట్లుగా చెప్పిన నిర్మలమ్మ పంచ్ లకు.. గులాబీ పార్టీ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.