Begin typing your search above and press return to search.

పేరుకు తగ్గట్లే ఆ కేంద్రమంత్రి మనసు ఎంత నిర్మలమంటే?

By:  Tupaki Desk   |   9 May 2022 9:30 AM GMT
పేరుకు తగ్గట్లే ఆ కేంద్రమంత్రి మనసు ఎంత నిర్మలమంటే?
X
పదవుల్ని.. అధికారాన్ని తలకు ఎక్కించుకున్న వారెవరూ ప్రజల మనసుల్ని దోచుకోరు. మెట్టు ఎక్కే కొద్దీ మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లే వారు మరింత ముందుకు వెళుతుంటారు. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలోని వారి తీరుకాస్త చిత్రంగా ఉంటుంది.

తమను తాము ఆకాశంలో నుంచి ఊడిపడ్డ వారన్నట్లు వ్యవహరిస్తుంటారు. చాలామంది బిల్డప్ ఇదే తీరులో ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా అత్యున్నత స్థానాల్లో ఉండి కూడా సింఫుల్ గా వ్యవహరించే కొందరి తీరు మనసును దోచుకునేలా చేస్తుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.

తాజాగా ఆమె నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు. ముంబయిలోని ఒక హోటల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ డీఎల్ ఎండీ పద్మజ చుండూరు మాట్లాడుతున్నారు.

ఆమె ప్రసంగం మధ్యలో మంచినీళ్లుకావాలని హోటల్ సిబ్బందిని అడిగారు. తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె మంచినీళ్లు అడిగిన విషయాన్ని గమనించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. తానే స్వయంగా గ్లాసు.. తన వద్ద ఉన్న మంచినీటి బాటిల్ తీసుకొని ఆమె వద్దకు వచ్చారు.

దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన వారు నిర్మలమ్మ సింప్లిసిటీని వేనోళ్లు పొగిడేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో ఉండి కూడా.. ఒకరు మంచినీళ్లు అడిగినంతనే లేచి ఇచ్చేందుకు ముందుకు రావటం ఆమె మంచితనానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మంచి మనసు.. వినయం.. విలువలను ప్రతిబింబిస్తుందని కేంద్రమంత్రి నిర్మలను ఉద్దేశించి మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ట్వీట్ చేశారు. తన సింప్లిసిటీతో నిర్మలమ్మ అందరి మనసుల్ని దోచేశారని చెప్పక తప్పదు.