Begin typing your search above and press return to search.
సారీ చెప్పి సానుభూతి కొట్టేసిన గడ్కరీ
By: Tupaki Desk | 27 July 2018 9:14 AM GMTసీనియర్ నేతలు కొందరు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. వివాదాలకు ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలో వారిని చూసి మిగిలిన వారు నేర్చుకుంటే మంచిది. తప్పు జరిగినప్పుడు.. అదో ఇష్యూగా మారే అవకాశం ఉన్నప్పుడు చటుక్కున స్పందించి సారీ చెప్పేస్తే.. డ్యామేజ్ స్థానే మైలేజీ పెరిగే అవకావం ఉంటుంది.
కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కోపం వచ్చింది. మధ్యప్రదేశ్ లోని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ స్థానంలో జరిగిన రహదారి ప్రారంభోత్సవానికి తనను పిలవకుండా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తనను అవమానించిందని.. చివరకు శిలాఫలకం మీద కూడా తన పేరు పెట్టలేదని ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం అలాంటి కార్యక్రమాలకు స్థానిక ఎంపీలను పిలవాల్సిన ఉన్నా.. పిలవలేదన్నారు. ఈ అంశంపై మధ్యప్రదేశ్ సీఎంపై తాను ప్రివిలేజ్ మోషన్ పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు.
దీనిపై వెంటనే స్పందించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఈ ఇష్యూ తన దృష్టికి వచ్చిందని.. ఇలా జరిగి ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీల పేర్లు కచ్ఛితంగా శిలాఫలకాల మీద ఉండాలన్నారు. ప్రారంభోత్సవానికి ఎంపీలను తప్పనిసరిగా ఆహ్వానించాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరైనందున.. దానికి తానే బాధ్యత వహిస్తానని.. అందరి తరఫున తాను క్షమాపణలు కోరుతున్నట్లు వ్యాఖ్యానించారు.
గడ్కరీ మాటలకు జ్యోతిరాదిత్య కాస్త తగ్గితే బాగుండేది.కానీ.. ఆయన మాత్రం తాను చెప్పేదే చెబుతూ.. వెనక్కి తగ్గలేదు. దీంతో లోక్ సభ స్పీకర్ స్పందిస్తూ రక్షణ కల్పించటానికి లాఠీ ఉపయోగించాలా? క్షమాపణలు చెప్పారు కదా? ఇష్యూ క్లోజ్ అయ్యింది కదా అన్న మాటలకు జ్యోతిరాదిత్య వెనక్కి తగ్గలేదు. దీనిపై పలువురు సభ్యులు స్పందించి.. మంత్రి సారీ చెప్పారు కాబట్టి ఆఇష్యూను వదిలేయాలనటంతో ఆయన కామ్ కాక తప్పలేదు. అదేదో ముందే చేసి ఉంటే బాగుండేది కదా?