Begin typing your search above and press return to search.

అబ్బే...మోడీయే ప్ర‌ధాని నేను కాదు

By:  Tupaki Desk   |   2 March 2019 4:31 AM GMT
అబ్బే...మోడీయే ప్ర‌ధాని నేను కాదు
X
బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు - కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గత కొద్దికాలంగా పార్టీ అధిష్ఠానం - కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఆయన ఇలాంటి విమర్శలు చేస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పుష్కలంగా ఆరెస్సెస్ మద్దతున్న ఆయనకు పార్టీ వీర విధేయుడన్న పేరుంది. అలాంటి నాయకుడే ప్రభుత్వాన్ని తప్పుబడుతుంటంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. మరోవైపు - గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఎన్డీయే మిత్రపక్షం శివసేన డిమాండ్ చేస్తున్నది. గడ్కరీ ఎక్కుపెట్టిన విమర్శలు ఇలా ఉన్నాయి. ఇలా విమ‌ర్శ‌లు వ‌స్తున్న వ‌స్తున్న త‌రుణంలో నితిన్ గడ్కరీ స్పందించారు. తాను ప్రధాని పదవి రేసులో లేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - ఛత్తీస్‌ గఢ్ రాష్ర్టాల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో గడ్కరీ అప్పట్లో స్పందిస్తూ బీజేపీలోని కొందరు వ్యక్తులు తక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పార్టీ అగ్రనేతలు అమిత్ షా - మోదీ చేసిన ప్రసంగాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల పుణె జిల్లా అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ నాయకుడనే వాడు ఓటమిని కూడా అంగీకరించాలి అని పరోక్షంగా మోదీ - అమిత్ షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇలా క‌ల‌క‌లం రేపే కామెంట్ల‌కు మారుపేరుగా మారిన గ‌డ్క‌రీ ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌ లో వీటికి చెక్ పెట్టే క్లారిటీ ఇచ్చారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో హంగ్ సభ ఏర్పడితే ఏకాభిప్రాయ ప్రధాని అభ్యర్థిగా తన పేరు ముందుకు వస్తుందన్న వదంతులపై స్పందిస్తూ అది కేవలం పగటి కల (ముంగేరి లాల్ కీ హసీన్ సప్నే) అని చెప్పారు. తాను పూర్తిగా ఆరెస్సెస్ కార్యకర్తనని - దేశమే తనకు సర్వస్వమన్నారు. ``మోడీజీ మళ్లీ ప్రధాని అవుతారు. మోడీజీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో ముందుకు వెళుతోంది. మేమంతా ఆయన వెనుకే ఉన్నాం. నేను ప్రధానిని అవుతానన్న ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది?`` అని సభికులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. త్వరలో జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని విశ్వసిస్తారా? అన్న ప్రశ్నపై గడ్కరీ స్పందిస్తూ రెండు పార్టీల సిద్ధాంతాలు వేర్వేరన్నారు. మేం శత్రువులం కాదు. మా మధ్య భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. ఇది మన సంప్రదాయం అని పేర్కొన్నారు.