Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడేసిన కేంద్ర మంత్రి.. బీజేపీ నేతలకు ఇరాకటమే

By:  Tupaki Desk   |   17 March 2021 7:30 AM GMT
కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడేసిన కేంద్ర మంత్రి.. బీజేపీ నేతలకు ఇరాకటమే
X
తన గొప్పతనాన్ని తాను మాత్రమే చెప్పుకుంటే అంత బాగోదు. రాజకీయాల్లో ఇలాంటి తీరు పెద్దగా వర్కువుట్ కాదు. కొన్ని సందర్భాల్లో మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉండి.. ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తే వీలుంది. అలాంటిది.. తమ పార్టీకి సంబంధం లేని ముఖ్యనేతలు పొగిడితే వచ్చే మైలేజీ అంతా ఇంతా కాదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా తీరును స్వయంగా కేంద్రమంత్రి పొగడటం.. అది కూడా రాజ్యసభలో కావటం ఆసక్తికరంగా మారింది.

దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని రీతిలో తెలంగాణ.. గోవాలో మాత్రమే గ్రామాల్లో వంద శాతం ఇళ్లకు కొళాయి ద్వారా తాగునీరు అందిస్తున్నారని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. తాజాగా రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వం లేదని.. కానీ అక్కడి సర్కారును తాను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

తాగునీరు తెచ్చుకోవటానికి ఆ రెండు రాష్ట్రాల్లోని పేద మహిళలు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మహిళలు తాగు నీటి కోసం జీవితాంతం నడిచే దూరాన్ని కలిపి లెక్కిస్తే..అది భూమండలాన్ని నాలుగైదుసార్లు చుట్టినంత అవుతుందని పేర్కొన్నారు. అదే పనిగా తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ సర్కారుపై ఏదో ఒక అంశంపై దుమ్మెత్తి పోస్తున్న వేళ.. వారి పార్టీకే చెందిన కేంద్రమంత్రి రాజ్యసభలో నేరుగా పొడిగేసిన వైనం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొండంత బలంగా మారనుంది. అదే సమయంలో.. తెలంగాణ బీజేపీ నేతలు ఆచితూచి అన్నట్లు రియాక్టు కావాల్సిన అవసరం ఉంది. మరేం చేస్తారో చూడాలి.