Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు హాయిహాయిగా.. సర్కార్ కి తీయతీయగా...

By:  Tupaki Desk   |   17 Dec 2021 5:30 PM GMT
ఉద్యోగులకు హాయిహాయిగా.. సర్కార్ కి తీయతీయగా...
X
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఉద్యమమే అన్నారు. సమర శంఖం గట్టిగానే పూరించారు. ఇక తగ్గేది లేదంటూ ఆందోళన బాట పట్టారు. అంతేనా తాడో పేడో అనేశారు. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంఘాల నోటి వెంట రాజకీయ ప్రకటనలు కూడా వచ్చాయి. తాము తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని కూడా రెచ్చగొట్టుడు మాటలే మాట్లాడారు.

తమ సత్తా చూపిస్తామని ఓట్ల లెక్కలు కూడా చెప్పారు. తాము పదమూడు లక్షలు, ఫ్యామిలీస్ తో కలుపుకుంటే అరవై లక్షలకు పైగా ఓటు బ్యాంక్ ఉందని కూడా కవ్వించారు. ఇక ప్రభుత్వం మీద నమ్మకం లేదని రెండున్నరేళ్ళు వేచి చూశామని కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇక తాము ఎంత మాత్రం ఉపేక్షించమని, తమ డిమాండ్లను ఒక్క లెక్కన ఆమోదిస్తేనే తాము ఆందోళన విరమించేది అని కూడా చెప్పుకొచ్చారు.

ఇంతలా హూంకరించిన ఉద్యోగ సంఘాలు ఇపుడు అంతే తీరున తగ్గిపోయారు. ఆ మాట కంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి అంతా ఒకే చేసుకున్నారు. ఈ చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని, ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని కూడా వారు ప్రకటించారు. మరో వైపు ప్రభుత్వం కూడా అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వేతన సవరణ సంఘం నివేదిక అమలు తదితర సమస్యలపై ఏపీ జేఏసీ, ఉద్యోగుల సంఘం నేతలు తాత్కాలికంగా సమ్మెకు పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లతో వరుసగా నాలుగు రోజుల పాటు చర్చలు జరిపి అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు.

పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది అని అటూ ఇటూ చెబుతున్నారు. అలాగే, రెండు జేఏసీలు, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపారు. పెండింగ్ లో 71 డిమాండ్లు ఉన్నాయని, వీటిలో చాలా డిమాండ్లు ఆర్థికంగా లేవని కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

అయితే ఇక్కడ మెలిక ప్రభుత్వం పెట్టింది. అన్ని సమస్యలకు ఒక్కరోజులో పరిష్కారం దొరకదని పేర్కొనడమే గమనార్హం. అయితే చాలా వరకూ సమస్యలు తీరిపోయాయని ఆర్థిక మంత్రి బుగ్గన ఉద్యోగ సంఘాలకు వివరించారు.

ఉద్యోగ సంఘాలతో సమావేశాలు, చర్చలు జరపడం నిరంతర ప్రక్రియ అని, పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక మంత్రి హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. అలా ఉద్యోగులు అందోళన బాట నుంచి తప్పుకున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే 52 శాతం ఫిట్మెంట్ హామీ ఇస్తే తప్ప చర్చలు ముందుకు సాగవని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. కానీ ప్రభుత్వం మత్రం ఫిట్మెంట్ అంత ఇవ్వలేమని చెబుతూనే వచ్చింది. మరి పీయార్సీ మీద ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి అన్నది కూడా వినిపించింది. మరి ఏమైందో ఏమో కానీ ఉద్యోగులు ప్రభుత్వంతో సానుకూల వాతావరణంలో చర్చలు ముగించుకుని ఆఫీస్ బాట పట్టారు.

మరి జగన్ ఉద్యోగులు కోరినట్లుగా ఫిట్మెంట్ యాభై శాతం ఇస్తారా. అలాగే వారు కోరుతున్న మరో చిరకాల‌ డిమాండ్ కొరకరాని కొయ్య అయిన సీపీఎస్ ని రద్దు చేస్తారా, ఖాళీ పోస్టులు భర్తీ చేసి పని భారం తగ్గిస్తారా.కరోనాతో చనిపోయిన వారి వారసులతో కారుణ్య నియామకాలు చేపడతారా అన్నది చూడాలి. ఇక ఉద్యోగులకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలని కూడా డిమాండ్ గా ఉంది. మొత్తానికి ఇవన్నీ ప్రభుత్వానికి ఒక విధంగా భారమే. ఆర్ధికంగానే కాకుండా ఇతరత్రా సమస్యలు ఉన్నాయి.

అయితే ప్రస్తుతానికి ఉద్యోగ సంఘాలు శాంతించాయి కానీ ప్రభుత్వం ఏ విధంగా పాజిటివ్ గా అడుగులు వేయకపోతే మాత్రం కచ్చితంగా వారు పోరుబాట పట్టరు అన్న గ్యారంటీ ఏమీ లేదు. అయితే ఉద్యోగులు అంతా తమ కుటుంబ సభ్యులే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఉద్యోగులు కలసి వచ్చి సామరస్యంగా వ్యవహరిస్తే మంచిదే అన్న మాట అయితే ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వానికి తీయతీయగా, ఉద్యోగులకు హాయిహాయిగా అంతా ఉందనుకోవాలి.