Begin typing your search above and press return to search.

ముంబ‌యికి అమెరికా ఫ్లైట్స్ బంద్‌!

By:  Tupaki Desk   |   21 Jun 2019 6:19 AM GMT
ముంబ‌యికి అమెరికా ఫ్లైట్స్ బంద్‌!
X
అమెరికా- ఇరాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక‌త్త‌లు ఇప్పుడు కొత్త స‌మ‌స్య‌కు తెర తీశాయి. త‌మ గ‌గ‌న‌త‌లంలో అక్ర‌మంగా ప్ర‌వేశించిన అమెరికాకు చెందిన నిఘా డ్రోన్ ను ఇరాన్ కూల్చివేయ‌టంతో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు మ‌రింత ముదిరిపోయాయి. తాజా ప‌రిణామంతో ఇరాన్ ఆధీనంలో ఉన్న గ‌గ‌న‌త‌లం మీదుగా అమెరికా విమానాలు వెళ్ల‌కుండా ఉండేలా ఆ దేశ ఫెడ‌ర‌ల్ ఏవియేష‌న్ ఆడ్మినిస్ట్రేష‌న్ అత్య‌వ‌స‌ర ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేప‌థ్యంలో భార‌త ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యికి ఫ్లైట్స్ రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ నివార్క్ త‌న ముంబ‌యి స‌ర్వీసుల్ని నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త కోస‌మే తామీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా పేర్కొన్నారు.

ముంబయి నుంచి న్యూజెర్సీలోని నివార్క్ ఎయిర్ పోర్ట్ కు రావాల‌నుకునే ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ మార్గాల్ని వెతుక్కోవాల్సిందిగా కోరింది. అయితే.. విమానాల ర‌ద్దు ఎంత‌వ‌ర‌కు అన్న విష‌యం మీద క్లారిటీ రావ‌టం లేదు. అమెరికన్ ఎయిర్ లైన్స్.. డెల్టా ఎయిర్ లైన్స్ కూడా ఇరాన్ గ‌గ‌న‌త‌లం మీదుగా న‌డిచే విమానాల్ని ర‌ద్దు చేశాయి.

వీరి బాట‌లోనే జ‌పాన్ కు చెందిన జ‌పాన్ ఎయిర్లైన్స్.. ఏఎన్ ఏ హోల్డింగ్స్ కూడా త‌మ విమానాలు న‌డ‌ప‌మ‌ని తేల్చాయి. ఇంత‌వ‌ర‌కూ రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు మ‌రో స్థాయికి పెరిగి.. సామాన్య ప్ర‌జ‌ల్ని నేరుగా ప్ర‌భావం చూపే వ‌ర‌కు వ‌చ్చాయి. మ‌రి.. ఈ ఉద్రిక్త‌త‌లు ఎక్క‌డి వ‌ర‌కు వెళతాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.