Begin typing your search above and press return to search.

ఐరాస హెచ్చ‌రిక‌: మ‌హిళ‌లు జాగ్ర‌త్త‌.. ముందుంది మీకే క‌ష్టం

By:  Tupaki Desk   |   2 May 2020 2:00 PM GMT
ఐరాస హెచ్చ‌రిక‌: మ‌హిళ‌లు జాగ్ర‌త్త‌.. ముందుంది మీకే క‌ష్టం
X
క‌రోనా వైర‌స్ మొత్తం మాన‌వ సమాజాన్ని అతాల‌కుత‌లం చేస్తోంది. ఆ వైర‌స్ ప్ర‌భావంతో ప్ర‌పంచంలో విప‌రీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి, ధ‌నికులు ఇలా అంద‌రూ ఆ వైర‌స్‌తో ప్ర‌భావిత‌మ‌వుతూనే ఉన్నారు. ఆ వైర‌స్ క‌ట్ట‌డికి తీసుకున్న చ‌ర్య‌ల‌తో భ‌విష్య‌త్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఉద్యోగాల కోత‌, జీతాల త‌గ్గింపు అనేవి ఉద్యోగుల‌కు సంక‌టంగా మారుతున్నాయి. అయితే వీరిలో ముఖ్యంగా మ‌హిళ‌లకే తీవ్ర న‌ష్టం ఏర్ప‌డుతుంద‌ని ఐక్య రాజ్య స‌మితి వెల్ల‌డిస్తోంది. స‌మాజంలో అసమానతలు, లింగ వివక్ష వంటి ప‌రిణామాలు సంభ‌విస్తాయ‌ని హెచ్చ‌రిస్తోంది.ఈ విష‌యాన్ని ఐక్య రాజ్య సమితి సెక్ర‌ట‌రీ జనరల్‌ ఆంటోనియో గుటెర‌స్ వెల్ల‌డించారు. కరోనా మహిళల భద్రతకు సవాలుగా మారిందని తెలిపారు.

ఈ విష‌య‌మై గుటెర‌స్ కరోనా పరిణామ క్రమంపై అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి ఓ వ్యాసం రాశారు. ఈ మేర‌కు ఆ వ్యాసాన్ని ఐరాస తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. కరోనా వైర‌స్ ప్ర‌భావంతో మహిళా శక్తి అర్ధ శతాబ్దం వెనక్కు వెళ్లినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. లాక్‌డౌన్, క్వారంటైన్‌తో మ‌హిళలపై ప్రపంచవ్యాప్తంగా గృహ‌హింస పెరిగిందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మహిళలపై హింస పెరగకుండా ఇప్పటికే ప్రపంచంలోని 143 దేశాలు రక్షణ చర్యలు మొదలు పెట్టాయని తెలిపారు. కానీ, కరోనా కారణంగా ఏర్ప‌డే ఆర్థిక సంక్షోభం మహిళల జీవ‌న విధానం దెబ్బ‌తీస్తోంద‌ని, సంక్షోభ కాలంలో మహిళలపై అరాచకం పెరిగి పోతోందని వివ‌రించారు. వారి హక్కులు, స్వేచ్ఛపై దాడి జరుగుతోందని చెప్పారు. తాను చిన్న‌ప్పుడు మ‌హిళ‌లు ప‌డిన క‌ష్టాల‌ను చూశాన‌ని, మోయలేని బరువులు నెత్తిన పెట్టుకుని కూలీకి వెళ్లడం గమనించానని.. అవే త‌న‌ను రాజకీయాల్లోకి రావడానికి కారణమైంద‌ని పేర్కోన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, మహిళలకు సమాన పని, వేతనం లభించాలని కోరుకున్నాన‌ని, ఇప్పుడు నెర‌వేరింద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తూనే ఇప్పుడు కరోనా వైర‌స్ వ‌ల‌న మ‌ళ్లీ మ‌హిళ‌ల‌కు పూర్వ స్థితి రాబోతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మళ్లీ పాత పరిస్థితుల్లోకి మ‌హిళ‌ల‌ను నెడుతోందని అనిపిస్తోందని, ఈ క్ర‌మంలో మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల ఉద్యోగాలు పోతాయని చెప్పారు. మొదట ప్రభావం చూపేది మహిళల మీదనే అని అభిప్రాయప‌డ్డారు. దీంతోపాటు బాలిక విద్యను కూడా ప్రభావితం చేస్తుంద‌ని చెప్పారు. దానికి ఉదాహ‌ర‌ణ‌గా ఎబోలా వైరస్‌తో ప్ర‌భావిత‌మైన దేశాల్లో బాలిక విద్య 50 నుంచి 34 శాతానికి తగ్గిపోయింద‌ని గుర్తుచేశారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే రాజకీయ నాయకత్వం అప్ర‌మ‌త్తం కావాల‌ని, బాలిక విద్యతో పాటు, మహిళలకు సామాజిక భద్రత, ఆరోగ్య బీమా, సిక్, చైల్డ్‌ కేర్‌ సెలవులు, నిరుద్యోగ భృతి కల్పన లాంటి వంటి వాటిపై దృష్టి సారించాల‌ని సూచించారు.