Begin typing your search above and press return to search.

దావూద్ ఇళ్లను బయటపెట్టిన ఐరాస!

By:  Tupaki Desk   |   23 Aug 2016 10:32 AM GMT
దావూద్ ఇళ్లను బయటపెట్టిన ఐరాస!
X
దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడు, అతడు ఉంటున్న ఇంటి ఫోన్ నెంబర్ కూడా మాకు తెలుసు.. ఈ విషయంలో మావద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయని భారత్ ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వాదనలు చేసినా.. పాక్ నుంచి వచ్చే సమాధానం ఒకటే! దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో లేడు అని! ఎన్నో సందర్భాల్లో దావూద్‌ కు పాకిస్థానే ఆశ్రయం కల్పిస్తోందని భారత్ చేస్తున్న వాదనలను పాక్ ఒకె మాటతో తిప్పికొడుతూ వస్తోంది. అయితే తాజాగా దావూద్ స్థావరాలకు సంబందించిన ఒక విషయం తెలిసింది. ఇది భారత్ చెబుతున్న విషయాలు కాదు, స్వయంగా ఐక్యరాజ్యసమితి చెబుతున్న సమాచారం.

విషయానికొస్తే... అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పాకిస్తాన్‌ లోనే ఉన్నాడని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందం తేల్చింది. పాకిస్తాన్‌ లోని ఆరు ప్రాంతాల్లో దావూద్‌ కు ఇళ్లు ఉన్నాయని ఈ ప్రత్యేక బృదం నిర్దారించింది. దావూద్ పాక్ లోనే తలదాచుకుంటున్నాడని, అతడు ఉంటున్న ఇంటి చిరునామాలు ఇవే అని భారత్‌ సూచించిన తిమ్మిది చిరునామాలలో ఆరు సరైనవేనని ఈ ప్రత్యేక బృందం తేల్చింది. దీంతో ఇన్నాళ్ల భారత వాదనలకు మరింత బలం చేకూరింది. అయితే ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సమాచారంపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కాగా దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడనే బుకాయింపు పాక్ కు నిత్యకృత్యంగా మారిపోయింది. ఈ విషయాలపై సీఎన్‌ఎన్‌ - న్యూస్‌ 18 చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ లో అతడు పాకిస్తాన్‌ లోని కరాచీలో ఒక భారీ విలాస భవనంలో ఉంటున్నాడనే విషయం వెలుగులోకి తేవడం.. ఇదిగో ఇదే దావూద్‌ ఇబ్రహీం కరాచీ అడ్రస్‌.. డి13 - బ్లాక్‌ 4 - క్లిఫ్టన్‌ - కరాచీ అని ఆధారాలతో సహా దాన్ని బయటపెట్టడం తెలిసిందే. ఇన్ని ఆధారాలు చూపించినా కూడా పాకిస్థానీ ప్రభుత్వం ఎప్పటిలాగానే "దావూద్ తమ దేశంలో లేడు" అని ప్రకటించింది. అయితే అప్పట్లో ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ పై స్పందించిన దావూద్‌ అనుచరుడు చోటాషకీల్‌.. దమ్ముంటే దావూద్‌ ను పట్టుకోవాలని భారత ప్రభుత్వాన్ని సవాల్‌ చేశాడు.