Begin typing your search above and press return to search.

తెలంగాణలో అన్ లాక్ 4 ఇలా..ఏడు నుంచి పట్టాలపైకి మెట్రో

By:  Tupaki Desk   |   2 Sep 2020 4:45 AM GMT
తెలంగాణలో అన్ లాక్ 4 ఇలా..ఏడు నుంచి పట్టాలపైకి మెట్రో
X
రెండు..మూడు రోజుల క్రితం అన్ లాక్ 4 మార్గదర్శకాల్ని జారీ చేసింది కేంద్ర సర్కారు. దీనికి తగ్గట్లే తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు పలు నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన మెట్రో రైళ్లను ఈ నెల ఏడు నుంచి నడపాలని నిర్ణయించింది. అయితే.. గతంలో మాదిరి కాకుండా దశల వారీగా మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని ఇప్పటికే విడుదల చేశారు. అంతేకాదు.. కేంద్ర మార్గదర్శకాలకు తగ్గట్లే.. తెలంగాణ రాష్ట్రంలోనూ పలు అంశాలకు సంబంధించి అన్ లాక్ 4 షురూ కానున్నట్లుగా పేర్కొంది.

ఈ నెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు నడుస్తాయని చెప్పిన ప్రభుత్వం.. ఆన్ లైన్ క్లాసుల్ని నిర్వహించుకోవచ్చని పేర్కొంది. స్కూళ్లు.. కాలేజీలు.. విద్యా శిక్షణ సంస్థలు.. సినిమాహాళ్లు.. స్విమ్మింగ్ పూల్స్.. ఎంటర్ టైన్ మెంట్ పార్కులు.. థియేటర్ల మీద మాత్రం నిషేధం కంటిన్యూ అవుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర సర్కారు ఆన్ లాక్ గైడ్ లైన్స్ ను విడుదల చేసినట్లుగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. బార్లు.. క్లబ్ లు మూసి ఉంటాయని.. వాటిని తెరవాలంటే మాత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. 65 ఏళ్లు దాటిన వారు.. అనారోగ్యవంతులు.. గర్భిణులు.. పదేళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టం చేశారు.

కంటైన్మెంట్ జోన్ల బయట నుంచి ఆన్ లైన్ విద్య కోసం స్కూళ్లలో పని చేసే సిబ్బందిలో యాభై శాతం మంచి అధ్యాపక.. అధ్యాపకేతర సిబ్బంది హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. అంతేకాదు.. 9 నుంచి ప్లస్ టూ విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. అధ్యాపకుల మార్గనిర్దేశం కోసం స్వచ్ఛందంగా స్కూళ్లు.. కాలేజీలు సందర్శించే వీలుంది. అయితే.. ఇందుకు తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

సామాజిక.. విద్యా.. క్రీడలు.. వినోదం.. అధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ ను వంద మందితో నిర్వహించుకోవచ్చన్నారు. వివాహ సంబంధిత కార్యక్రమాల్ని గరిష్ఠంగా వంద మందితో నిర్వహించుకోవచ్చని.. అంతేకాదు.. అంత్యక్రియలు.. చివరి కర్మల్లోనూ వందమంది హాజరయ్యేందుకు అనుమతిని ఇచ్చారు.