Begin typing your search above and press return to search.

మార్కులేయని మాస్టారు...గోడ కుర్చీ తప్పదా... .?

By:  Tupaki Desk   |   6 Feb 2022 5:49 AM GMT
మార్కులేయని మాస్టారు...గోడ కుర్చీ తప్పదా... .?
X
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు విషయంలో ఇప్పటికి శాంతియుతమైన పరిష్కారం లభించింది అని అంతా భావిస్తున్నారు. చలో విజయవాడ పేరిట తమ బలాన్ని ప్రదర్శించి ఉద్యోగి ప్రభుత్వ పెద్దల మీద ఎర్రెర్రని చూపే చూశాడు. ఆ తరువాత పరిణామాలు చూస్తే ఒకటొకటిగా అలా అన్నీ కూడా చకచకా మారిపోయాయి. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఒక్కసారిగా పది మెట్లు దిగి వచ్చింది. వారి డిమాండ్లను ఒప్పుకుంది.

కేవలం ఫిట్ మెంట్ దగ్గర మాత్రమే 23 శాతానికి ఉద్యోగులను ఒప్పించగలిగింది. మిగిలినవి అన్నీ కూడా సేమ్ టూ సేమ్ గా వారి కోరినవే ఇచ్చేసింది. దీంతో ఉద్యోగులు మహా బాగా చల్లబడ్డారు, ఇక మీదట తమ ఆందోళన విరమించుకుంటున్నామని చెప్పారు. ఇకనేమిటి హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అని ప్రభుత్వ పెద్దలు భావిస్తూండగా స్టీరింగ్ కమిటీలో ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం ఇది మాకు సమ్మతం కాదని వారు మండిపడుతున్నారు.

అంతా ఏకపక్షంగా చర్చలు జరిపారని, ఉపాధ్యాయుల ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ఈ ఒప్పందాలు ఉన్నాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అంటున్నారు. తమకు రావాల్సిన ఇంటి అద్దె అలవెన్స్ లో 12 శాతం నుంచి పది శాతానికి తగ్గించేయడం పట్ల వారు మండిపడుతున్నారు.

ఇక ఫిట్మెంట్ 23 శాతం ఏంటి, ఎవరెలా ఓకే అన్నా కూడా ఉపాధ్యాయులకు మాత్రం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఆయన డిమాండ్ చేయడం విశేషం. అంతే కాదు పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో జరిపిన చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని అంటున్నారు.

తాము ఉద్యమానికి రెడీగా ఉన్నామని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. మొత్తానికి చూస్తే సమ్మె బాధ తప్పింది. ఉద్యోగులు హ్యాపీ ఇక అంతా హ్యాపీ అని సర్కార్ పెద్దలు అనుకున్నంత సేపు పట్టలేదు, ఉపాధ్యాయులు ఎర్ర జెండా పట్టుకుంటున్నారు. జగన్ సర్కార్ కి తాము మార్కులు వేయమని అంటున్నారు. మరి మాస్టార్ మెప్పు పొందేందుకు జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి