Begin typing your search above and press return to search.

చైనాలో వారిపై హింస నిజ‌మే.. యూఎన్‌వో షాకింగ్ నివేదిక‌!

By:  Tupaki Desk   |   2 Sep 2022 12:30 PM GMT
చైనాలో వారిపై హింస నిజ‌మే.. యూఎన్‌వో షాకింగ్ నివేదిక‌!
X
చైనా ప్రభుత్వం మైనార్టీలపై మారణహోమాన్ని సృష్టిస్తోందని గత కొంత కాలంగా అమెరికాతో స‌హా అనేక దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఐక్యరాజ్య సమితి (యూఎన్‌వో) కూడా ఇది నిజ‌మేన‌ని పేర్కొంది. ఈ మేర‌కు ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వ హ‌క్కుల సంఘం ఒక షాకింగ్ నివేదిక‌ను విడుద‌ల చేసింది. దీంతో ఇన్నాళ్లూ బుకాయిస్తూ వ‌స్తున్న చైనా తీవ్ర ఇబ్బందుల్లో ప‌డింది.

ఉగ్రవాద నిర్మూలన పేరుతో చైనాలోని పశ్చిమ జిన్‌ జియాంగ్‌ ప్రాంతంలో వీగర్లు, ఇతర ముస్లింలను నిర్బంధించి చైనా ప్రభుత్వం తీవ్ర‌ హింసకు పాల్పడుతున్న విషయం నిజ‌మేన‌ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం తాజాగా త‌న నివేదిక‌లో పేర్కొంది. నిర్బంధంలోకి తీసుకున్న మైనార్టీలపై చైనా కనీస మానవత్వం చూపించకుండా ఘోరమైన నేరాలకు పాల్పడే ప్ర‌మాదాన్ని కూడా కొట్టి పారేయలేమని యూఎన్‌వో తాజా నివేదిక వెల్ల‌డించింది.

వాస్త‌వానికి ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక చాలా కాలం కిందటే బయటకు రావాల్సి ఉంది. అయితే ఐక్య‌రాజ్య‌స‌మితికి అమెరికా కంటే అధికంగా నిధులు అందిస్తూ చైనా ఇన్నాళ్లూ ఆ నివేదిక‌ను బ‌య‌ట‌కు రాకుండా చూసింది. దీంతో మైనార్టీల‌పై చైనా ప్ర‌భుత్వ అరాచ‌కాలు లోకం దృష్టికి రాలేదు.

ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వ హ‌క్కుల సంస్థ అధిప‌తి మిషెల్లీ బచెలెట్ ఆగ‌స్టు 31న‌ తన పదవీ కాలం ముగియడానికి కేవలం 13 నిముషాల ముందు ఈ నివేదికను బ‌య‌ట‌పెట్టారు. దీంతో అంతర్జాతీయంగా చైనా మైనార్టీల‌పై సాగిస్తున్న అరాచ‌కాలు వెలుగుచూశాయి. ఈ నివేదిక విడుదల కాకుండా అడ్డుకోవడానికి తనపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని కూడా బచెలెట్‌ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

పశ్చిమ జిన్‌ జియాంగ్‌ ప్రాంతంలోని వీగర్లు, ఇతర ముస్లిం మైనార్టీలపై గ‌త ఐదేళ్లుగా చైనా ప్రభుత్వం హింసాకాండకు పాల్పడుతున్నట్టు మానవ హక్కుల సంస్థలు, పశ్చిమ దేశాలు ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తూనే ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది వీగర్లను చైనా నిర్బంధించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేప‌థ్యంలో ఐక్యరాజ్య‌స‌మితి అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల సంస్థ‌ నివేదికను అమెరికా, మరికొన్ని పశ్చిమ దేశాల‌ కుట్రగా చైనా అభివర్ణించింది. అమెరికా కుటిలనీతి ఫలితమే ఆ నివేదిక అని ఆరోపించింది.

మ‌రోవైపు చైనా ప్ర‌భుత్వ ఈ క్రూరమైన హింసపై అంతర్జాతీయ సమాజం తక్షణం స్పందించాలని కూడా మానవ హక్కుల సంఘం విన్న‌వించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.