Begin typing your search above and press return to search.

సుప్రీం తలుపులు ఎలా తెరుచుకున్నాయ్?

By:  Tupaki Desk   |   31 July 2015 3:47 AM GMT
సుప్రీం తలుపులు ఎలా తెరుచుకున్నాయ్?
X
స్వాతంత్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తలుపులు గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తెరుచుకున్నాయి. అదెలా సాధ్యమైంది? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆ సమయంలో కోర్టుకు రావాలని ఎందుకనిపించింది? వారు కోర్టుకు రావాలంటే ఏదో ఒక ప్రక్రియ జరగాలి కదా. కనీసం వారికి సమాచారం అందాలి కదా? ఆ సమాచారం వారికి ఎవరిచ్చారు? అందుకు సుప్రీం న్యాయమూర్తులు ఎలా స్పందించారనే విషయల్లోకి వెళితే.. గురువారం తెల్లవారుజామున చారిత్రక పరిణామాలు చోటు చేసుకున్న తీరు తెలుస్తుంది.

ఎప్పుడో రెండు దశాబ్దాలకు పైన.. ముంబయిలో చోటు చేసుకున్న బాంబుపేలుళ్లలో సంబంధం ఉన్న యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలుకు కేవలం కొద్ది గంటల ముందు చోటు చేసుకున్న ఈ అరుదైన పరిణామంలోకి వెళితే..

బుధవారం రాత్రి యాకూబ్ ఉరిశిక్ష అమలు నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చేసుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వెనువెంటనే యాకూబ్ మెమన్ న్యాయవాదులు హుటాహుటిన.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తును బుధవారం రాత్రి 11.10 గంటల సమయంలో ఆయన నివాసంలో కలిశారు.

యాకూబ్ ఉరి అమలు విషయంలో రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించిన తర్వాత కనీసం 14 రోజుల వరకూ ఉరి తీయకూడదన్న నిబంధన ఉందని.. దాన్ని అమలు చేయాలని విన్నవించారు. అందుకు విచారణ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో.. ఈ అంశంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకుంటూ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ఒక త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.

ప్రధానన్యాయమూర్తి తీసుకున్న నిర్ణయాన్ని.. త్రిసభ్య ధర్మాసనం సభ్యుల దృష్టికి తీసుకెళ్లేందుకు యాకూబ్ తరఫు న్యాయవాదులు పరుగులు తీశారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో వారు జస్టిస్ మిశ్రా ఇంటి తలుపులు తట్టారు. విషయాన్ని ఆయనకు విన్నవించారు. ఆయన వెనువెంటనే.. మిగిలిన ధర్మాసనం సభ్యుల దృష్టికి తాజా వివరాల్ని తీసుకెళ్లి.. సుప్రీంకోర్టులో విచారణ చేపట్టాలన్న నిర్ణయాన్ని వెల్లడించారు.

దీంతో.. ఈ అసాధారణ సంఘటన గురించిన సమాచారం మీడియాకు అందింది. చివరకు అర్థరాత్రి 2.30 గంటల సమయంలో సుప్రీంకోర్టు తలుపులు తెరుచుకున్నాయి. న్యాయమూర్తులు.. న్యాయవాదులు అంతా కలిసి తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో సుప్రీంకోర్టులోని నాలుగో నెంబరు గదిలో విచారణ మొదలు పెట్టారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన విచారణ అనంతరం.. యాకూబ్ ఉరిశిక్షను నిలపాల్సిన అవసరం లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చటంతో.. చివరిలో ఏదో అద్భుతం జరిగి యాకూబ్ ఉరి ఆగుతుందని ఆశగా ఎదురుచూసిన న్యాయవాదులు.. నిరాశగా ఇంటి ముఖం పట్టారు.