Begin typing your search above and press return to search.

దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమా?

By:  Tupaki Desk   |   23 Aug 2019 11:07 AM GMT
దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమా?
X
2020.. ప్రపంచాన్ని మరో పెద్ద ఆర్థిక కుదుపు కుదిపేయబోతోందని ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా - చైనా - బ్రిటన్ సహా భారత్ ను ఈ ముప్పు కృంగదీస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు భారత ప్రణాళిక సంఘంలాంటి నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కూడా ఇదే హెచ్చరికలు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

గత 70 ఏళ్లలో భారత్ ఎప్పుడు ఇలాంటి ఆర్థిక మందగమన స్థితిని ఎదుర్కోలేదని.. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం సత్వరమే చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని నీతి అయోగ్ వైస్ చైర్మన్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

దేశంలో ఇప్పుడు ఆర్థిక మందగమనంతో ప్రైవేట్ రంగంలో రుణాలు ఇవ్వడం లేదని.. పెద్ద నోట్ల రద్దు - జీఎస్టీతో మొత్తం ఆర్థిక వ్యవస్థ దిగజారిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు 35 శాతం కూడా నగదు చెలామణీలో లేదని ఆయన బాంబు పేల్చారు. నాన్ బ్యాంకింగ్ సంస్థలను ఆదుకోకుంటే కంపెనీలు కుప్పకూలిపోతాయన్నారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

2018-19లో జీడీపీ 6.8శాతానికి పడిపోయిందని.. ఆర్థిక వ్యవస్థ ఈస్థాయిలో దిగజారడం ఆందోళన కలిగిస్తోందని నీతిఅయోగ్ వైస్ చైర్మన్ అన్నారు. భారీగా రుణాలు ఇవ్వడం వల్లే బ్యాంకింగ్ వ్యవస్థ దిగజారిందన్నారు. ఇప్పుడు బ్యాంకర్లు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం చెల్లింపులు కూడా సరిగా చేయకపోవడంతో మొత్తం వ్యవస్థలు కుప్పకూలే స్టేజీకి దిగజారాయని చెప్పుకొచ్చారు. మొత్తంగా దేశం ఆర్థికంగా పతనం అంచున ఉందని నీతిఅయోగ్ చైర్మన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.