Begin typing your search above and press return to search.

యూపీ, బిహార్ సంస్కృతులు.. ఏపీ, తెలంగాణ‌లోనా?

By:  Tupaki Desk   |   29 Oct 2021 5:30 PM GMT
యూపీ, బిహార్ సంస్కృతులు.. ఏపీ, తెలంగాణ‌లోనా?
X
ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉత్త‌రాది రాష్ట్రాలైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బిహార్ లో గ‌తంలోను, ఇప్పుడున్న ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న తీరును రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్నాయా? అనే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అక్క‌డ ఉన్న సంస్కృతినే ఇక్క‌డ కూడా పాటిస్తున్నార‌ని నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా ఉద్య‌మ నేప‌థ్యంలో ఏర్ప‌డిన తెలంగాణ‌లోను.. గ‌తంలో తాను త‌లుచుకున్న‌దే త‌డువుగా రోడ్డెక్కిన నాయ‌కుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న ఏపీలోనూ.. నిర్బంధాలు ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

``వారు అధికారంలో లేన‌ప్పుడు.. ఏం చేశారో అంద‌రికీ తెలుసు. కానీ, ఇప్పుడు.. మాత్రం వారికి గ‌తం గుర్తుకు రావ‌డం లేదా?`` అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం ఏంటి? అంటే.. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భావ ప్ర‌క‌ట‌న అనే స్వేచ్ఛ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదనేది నెటిజ‌న్ల ఆవేద‌న. కేవ‌లం నెటిజ‌న్లే కాదు.. రాజ‌కీయ పక్షాల నేత‌లు చెబుతున్న మాట కూడా ఇదే. నిజానికి ఎక్క‌డైనా.. ఎవ‌రైనా.. ప్ర‌భుత్వాలు అవ‌లంబిస్తున్న విధానాల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేసే హ‌క్కు రాజ్యాంగ బ‌ద్ధంగానే ల‌భించింది. అయితే.. కొన్ని ద‌శాబ్దాలుగా.. యూపీలోను, బిహార్ వంటి కొన్ని ఉత్త‌రాది రాష్ట్రాల్లో మాత్రం దీనిపై అప్ర‌క‌టిత నిర్బంధాలు కొన‌సాగుతున్నాయి.

అంటే.. `నిర‌స‌న` అన‌గానే.. ముంద‌స్తుగా.. నేత‌ల‌ను అరెస్టులు చేసేయ‌డం.. ప్ర‌తి నెల 1వ తారీకు రాగానే ఆయా జిల్లాల్లో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్ష‌న్ విధించ‌డం .. అనేది ఆయా రాష్ట్రాల్లో మామూలే అన్న‌ట్టుగా మారిపోయింది. ఇప్ప‌టికీ.. ఈ ప‌రిస్థితి కొన‌సాగుతోంది. అయితే.. ఇప్పుడు ఇదే సంస్కృతి ఏపీలోను, తెలంగాణ‌లోనూ అనుస‌రిస్తుండ‌డం తీవ్ర వివాదానికి.. నెటిజ‌న్ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. తాజాగా.. వ‌రి-ఉరి.. ఘ‌ట‌న‌పై బీజేపీ నేత‌లు..తెలంగాణ‌లో నిర‌స‌న వ్య‌క్తం చేసేందుకు రెడీ అయ్యారు. అంతే.. వారు ఇంకా నిర‌స‌న కూడా చేప‌ట్ట‌లేదు.. కానీ, పోలీసులు.. మాత్రం.. ఎక్క‌డిక‌క్క‌డ ముంద‌స్తుగా గృహ‌నిర్బంధాలు చేస్తున్నారు.

ఏపీలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక్క‌డ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో.. పోలీస్ యాక్ట్ 30 విధించేశారు. సెక్ష‌న్ 144 అమ‌లుచేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అస‌లు నిర‌స‌న వ్య‌క్తం చేసే హ‌క్కే లేద‌న్న‌ట్టుగా రెండు ప్ర‌భుత్వాలు ఇలా పోలీసుల‌ను పుర‌మాయించ‌డంపై.. స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. అస‌లు మ‌నం.. పొరుగు దేశంలో ఉన్నామా.. ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహాలు సైతం వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా రెండు ప్ర‌భుత్వాలు మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు