Begin typing your search above and press return to search.

మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   21 April 2022 10:27 AM GMT
మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై  యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం
X
రంజాన్ మాసం వేళ ఓ వర్గం వారు ప్రార్థనలు ఎక్కువగా చేసే ఈ టైంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక నుంచి మత పరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. లౌడ్ స్పీకర్లకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికి తమ మత విశ్వాసాలకు తగిన విధంగా ఆరాధించే స్వేచ్ఛ ఉంటుంది.. కానీ అది ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు అని సీఎం యోగి ఆదిత్యనాధ్ తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు మతపరమైన ప్రదేశాల్లో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించిన మూడు రోజుల తర్వాత యూపీలో యోగి ఈ ప్రకటన చేశారు.

అజాన్ సమయంలో 15 నిమిషాల ముందు.. తర్వాత లౌడ్ స్పీకర్ల ద్వారా హనుమాన్ చాలీసా, భజనలు ప్లే చేయరాదని నాసిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహారాష్ట్రలోని అన్ని మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు మే3లోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

కాగా ఇప్పటికే యోగి సర్కార్ మతపరమైన ఊరేగింపులు, ర్యాలీలకు అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకపై యూపీలో మతపరమైన ర్యాలీలకు పోలీసులకు అఫిడవిట్ ను సమర్పించాలని సీఎం తెలిపారు.

అనుమతి లేకుండా ఎలాంటి మతపరమైన ఊరేగింపు జరగకూడదని పేర్కొన్నారు. సాంప్రదాయ మతపరమైన ర్యాలీలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని.. కొత్త కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని తెలిపారు.