Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నికలు..హిజాబ్ దుమారం..అహ్మదాబాద్ పేలుళ్ల తీర్పు.. మధ్యలో దావూద్ గురి?

By:  Tupaki Desk   |   19 Feb 2022 10:38 AM GMT
యూపీ ఎన్నికలు..హిజాబ్ దుమారం..అహ్మదాబాద్ పేలుళ్ల తీర్పు.. మధ్యలో దావూద్ గురి?
X
ఓవైపు యూపీలో హోరాహోరీగా ఎన్నికలు.. మరోవైపు కర్ణాటకలో హిజాబ్ దుమారం.. అహ్మదాబాద్ పేలుళ్ల దోషులకు మరణశిక్ష.. దేశమంతా వరుస పరిణామాలతో వేడి మీద ఉండగా.. మధ్యలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హిట్ లిస్ట్ తో గురిపెట్టాడనే వార్తలు వస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. దుబాయ్ లో ఉన్నాడా..? కరాచీలో నక్కున్నాడా..? ఎక్కడున్నాడో తెలియదు కానీ.. మూడు దశాబ్దాలుగా భారత దేశం అత్యంత వెదుకులాడుతున్న నేరగాడు దావూద్ ఇబ్రహీం. ముంబై అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏలిన అతడు 1993 వరుస బాంబు పేలుళ్ల అనంతరం దేశం విడిచి పారిపోయాడు. అతడి అనుచరులు, ప్రత్యర్థులు దొరికారు కానీ.. దావూద్ మాత్రం ఇన్నాళ్లయినా చిక్కలేదు. అసలింతకీ అతడిని పట్టుకునేదెప్పుడు..? అనే విషయం తెలియరావడం లేదు. ఏదేమైనా దావూద్ దొరకడం అంత సులభం కాదని ఎప్పుడో స్పష్టమైంది.

మరోవైపు వయసు పైబడడంతో దావూద్ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నాడనే ప్రచారమూ ఉంది. ఇదివరకైతే.. దావూద్ ఇబ్రహీంను అప్పగించాలని పాకిస్థాన్ ను భారత్ కోరడం.. అతడు తమ వద్ద లేడని పాకిస్థాన్ నిస్గిగ్గుగా బొంకడం రివాజుగా ఉండేది. మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ పని చేయడం లేదు.

ఇన్నేళ్లలో బయటకొచ్చింది ఒక్క ఫొటోనే..

దావూద్ ఎలా ఉంటాడు? అంటే ఇప్పుడు సమాధానం చెప్పడం కష్టమేమో. వయసు వీడ పడిన అతడు ఇలా ఉన్నాడు...? అని చెప్పడం కూడా సాధ్యం కాదేమో? దావూద్ ఫొటోలు 30 ఏళ్లుగా ఒక్కటీ బయటకు రాని సంగతి చాలామందికి తెలియనే తెలియదు. ఇంటర్నెట్ లో వెదికిదే దావూద్ ఏ షార్జాలోనో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫొటోలో, కళ్లకు ఖరీదైన గ్లాసెస్ పెట్టుకుని కనిపించేవో..? చేతిలో సిగరెట్ తో ఛైర్ లో కూర్చున్నవో.. పచ్చ రంగు టీషర్ట్ తో ఫోన్ మాట్లాడుతున్నవో తప్ప ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలిపే ఫొటోలు దొరకవు.

వాస్తవానికి ఇప్పడు దావూద్ వయసు 66 ఏళ్లు. చీకటి సామ్రాజ్య అధినేతగా ఆర్థికంగా అతడు ఎప్పుడో బలవంతుడయ్యాడు. గల్ఫ్ రా కుటుంబాలతో సంబంధాలు ఏర్పర్చుకుని మరింత ముందుకెళ్లాడు. అయితే, అడపాదడపా అతడు భారత్ పై కన్నేస్తుంటాడని.. దేశంలో ఇప్పటికీ కొన్ని మాఫియా కార్యక్రమాలు అతడి కనుసన్నల్లోనే నడుస్తుంటాయని చెబుతుంటారు.ప్రత్యేక యూనిట్ తో నేతలు, బడా వ్యాపారులపై గురి

ప్రజా ప్రతినిధులు, డబ్బున్నవారిని బెదిరించడం, ఆర్థిక కార్యకలాపాల్లో చొరబడడం అండర్ వరల్డ్ మాఫియా పని. అలాంటి దావూద్ ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటుతో్ మళ్లీ భారత్‌పై మళ్లీ గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం వెల్లడించింది కూడా ఏ మీడియా సంస్థనో, స్వచ్ఛంద సంస్థనో కాదు.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ). దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను దావూద్ లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అంతేకాక దావూద్ ఇబ్రహీంపై ఇటీవల ఎన్‌ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక యూనిట్‌తో కలిసి భారత్‌ వ్యాప్తంగా భీకర దాడులకు ప్రణాళికలురచిస్తోన్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.బాంబు పేలుళ్లు, కాల్పులతో దేశంలో విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్లు తెలిపింది.

ముఖ్యంగా దిల్లీ, ముంబయిపై దృష్టిపెట్టినట్లు చెప్పింది. అతడి హిట్ లిస్ట్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పేర్లు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు సదరు కథనాలు తెలిపాయి.

ఇటీవల మనీ లాండరింగ్ కేసు

అనేక రకాల వక్ర మార్గాల్లో సంపాదించిన మాఫియా డాన్ పై ఎన్ఐఏ అభియోగ పత్రం ఆధారంగా ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

ముంబయిలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. దావూద్‌ సోదరి హసీనా పార్కర్‌ ఇంటికి కూడా అధికారులు వెళ్లినట్లు తెలిసింది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లోనూ ఈ సోదాలు జరిగినట్లు అధికారిక వర్గాలవెల్లడించాయి.మాఫియా హవాలా లావాదేవీలు, అక్రమాస్తుల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు దావూద్‌ సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌పై కూడా మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అతడిని కస్టడీలోకి తీసుకుంది.