Begin typing your search above and press return to search.

సీఎం రంగు ఆదేశంతో కొత్త ర‌చ్చ మొద‌లైంది

By:  Tupaki Desk   |   6 Jan 2018 6:13 AM GMT
సీఎం రంగు ఆదేశంతో కొత్త ర‌చ్చ మొద‌లైంది
X
యూపీ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న యోగి ఆదిత్య‌నాథ్ తీసుకున్న ఒక నిర్ణ‌యం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంపై ఒక వ‌ర్గం వారు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత యోగి ఒక వివాదాస్ప‌ద నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. అది ఇది అన్న తేడా లేకుండా యూపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్ర‌భుత్వ సంస్థ‌లు కాషాయ రంగు పూయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

ఈ నిర్ణ‌యంపై రాజ‌కీయ ర‌గ‌డ మొద‌లైంది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌తో పాటు.. హ‌జ్ క‌మిటీ ఆఫీసుల‌కు కూడా కాషాయ రంగు వేయ‌టంపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రి త‌మ కార్యాల‌యాలకు కాషాయ రంగు వేసేయ‌టం ఏమిటంటూ ముస్లిం పెద్ద‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇలా రంగులు వేయ‌టం స‌రికాద‌ని.. దీన్ని ఖండించాల్సిన అంశంగా వారు చెబుతున్నారు. రాజ‌కీయాల కోసం వాడే రంగును ఇలా వినియోగిస్తే ఎలా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా చూస్తూ ఉరుకుండిపోతే రేపొద్దున హ‌జ్ యాత్రికుల్ని సైతం కాషాయ దుస్తులు ధ‌రించ‌మంటారేమోఅంటూ లక్నో హ‌జ్ క‌మిటీ అధికారి ఖాజీ మౌలానా ఆస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు కాషాయ రంగు వేయాల‌న్న నిర్ణ‌యాన్ని షియా ప‌ర్స‌న‌ల్ లా బోర్డు స‌భ్యుడు మౌలానా యాసుబ్ అబ్బాస్ సైతం త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌భుత్వాలు మారిన ప్ర‌తిసారీ రంగులు మార్చేస్తుంటారా? ఈ నిర్ణ‌యం మ‌నోభావాల్ని దెబ్బ తీసే అంశంగా ఆయ‌న అభివ‌ర్ణిస్తున్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు కాషాయ రంగు వేయాలంటూ జారీ చేసిన ఆదేశాల్ని వెన‌క్కి తీసుకోవాల‌ని కోరుతున్నారు. లేని ప‌క్షంలో తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. యోగి స‌ర్కారు మాత్రం రంగు విష‌యంలో వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. కాషాయం శ‌క్తికి నిద‌ర్శ‌నమ‌ని.. ఇది ఎవ‌రి మ‌నోభావాల్ని దెబ్బ తీసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న క‌ల‌ర్ నిర్ణ‌యంపై యూపీ మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖామంత్ర మోసిన్ రాజా స్పందిస్తూ.. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని స‌మ‌ర్థించారు.

యోగి ముఖ్య‌మంత్రికావ‌టానికి ముందు యూపీలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు అన్ని తెల్ల రంగులో ఉండేవి. యోగి కొలువు తీరిన త‌ర్వాత ఆ రంగు స్థానంలో కాషాయ రంగు వేయాల‌న్న ఆదేశాల్ని జారీ చేశారు. యోగి ఆదేశాల నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యాల‌య‌మైన లాల్ బ‌హుదూర్ శాస్త్రి భ‌వ‌న్ తో మొద‌లెట్టి వంద స్కూళ్లు.. కొన్ని ఆర్టీసీ బ‌స్సులతో స‌హా పోలీస్ స్టేష‌న్ ల‌కు కాషాయ క‌ల‌ర్ అద్దేశారు. తాజాగా మైనార్టీ విభాగానికి భ‌వ‌నాల‌కు కాషాయ క‌ల‌ర్ అద్దేయ‌టంతో వివాదం రాజుకుంది. మ‌రి.. ముస్లిం మ‌త పెద్ద‌ల క‌ల‌ర్ ఇష్యూలో యోగి నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వేళ‌.. ఏం జ‌రుగుతున్న‌ద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట రేపుతోంది. తాను న‌మ్మిన విష‌యాల్లో వెన‌క్కి త‌గ్గే అల‌వాటు లేని యోగి.. తాజా వివాదంలో ఎలా స్పందిస్తారో చూడాలి.