Begin typing your search above and press return to search.

గంటలో రెండుసార్లు బతికాడు

By:  Tupaki Desk   |   6 Oct 2017 6:16 AM GMT
గంటలో రెండుసార్లు బతికాడు
X
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడమే అదృష్టం. అలాంటిది రెండుసార్లు అలా జరిగితే మరింత అదృష్టమని చెప్పుకోవాలి. ఇక కేవలం గంట వ్యవధిలోనే రెండుసార్లు ప్రమాదాల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడితే ఆ వ్యక్తిని సుడిగాడనే అనుకోవాలి. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన గౌరవ్ కుమార్ కూడా ఇప్పుడు తన గురించి తాను అలాగే అనుకుంటున్నాడట. గౌరవ్ ఎంత సుడిగాడంటే... గంట వ్యవధిలో రెండుసార్లు అతడిని మృత్యుదేవతలు ఎత్తుకెళ్లాలని చూసినా కూడా దాన్నుంచి తప్పించుకున్నాడు. అదృష్ట దేవత తన వైపు ఉండడంతోనే అలా జరిగిందంటున్నాడాయన.

యూపీలోని సద్దరుద్దీన్‌ పూర్‌ కు చెందిన గౌరవ్ కుమార్ (25) గురువారం వేకువజామున పనిమీద బిజ్నూరు వచ్చి, ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో వ్యతిరేక దిశలో వేగంగా వస్తున్న కారు అతడిని ఢీకొట్టింది. దీంతో అంతెత్తున ఎగిరిపడ్డాడు. గాయాలతో రోడ్డుపై పడి ఉన్న అతడిని 108 అంబులెన్స్‌లో నూర్పూర్‌ లోని పీహెచ్‌ సీకి తరలించారు. ఇక్కడ రెండోసారి అతడు మృత్యువు నుంచి బయటపడ్డాడు. అంబులెన్స్ నుంచి అతడిని ఆసుపత్రిలోకి తరలించిన సరిగ్గా 15 నిమిషాల తర్వాత అంబులెన్స్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు దెబ్బకు ఆసుపత్రి అద్దాలు పగిలిపోయాయి, అంబులెన్సయితే నామరూపాల్లేకుండా పోయింది. అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్‌ కు మంటలు అంటుకోవడం వల్లే పేలుడు జరిగింది.

గంట వ్యధిలోనే రెండుసార్లు జరిగిన ఈ ఘటనలను ఆసుపత్రి బెడ్‌పై ఉండి తలచుకున్న కుమార్ తన అదృష్టానికి పొంగిపోతున్నాడు. తనకు భగవంతుడు రెండుసార్లు పునర్జన్మ ప్రసాదించాడని చెబుతున్నాడు. మొత్తానికి అదృష్టమో, కాకతాళీయమో కానీ గౌరవ్ ప్రాణాలతో బయటపడడం సంతోషకరం.