Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వానికి ప‌రిహారం ఇవ్వండి..ఆందోళ‌నకారుల‌కు నోటీసులు!

By:  Tupaki Desk   |   25 Dec 2019 8:07 AM GMT
ప్ర‌భుత్వానికి ప‌రిహారం ఇవ్వండి..ఆందోళ‌నకారుల‌కు నోటీసులు!
X
పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ‌ల చ‌ట్టానికి వ్య‌తిరేకంగా యూపీలో కూడా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ అనేక మంది రోడ్డుకెక్కారు. ఆ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు హింసాత్మ‌కంగా కూడా మారాయి. ఆందోళ‌న కారులు శాంతీయుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు ప‌రిమితం కాలేదు. కొన్ని చోట్ల హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఆ ఘ‌ట‌న‌ల్లో ప్ర‌భుత్వ‌ - పోలీసుల ఆస్తుల‌ను ధ్వంసం చేశారు వాళ్లంతా.

బ‌స్సుల‌కు నిప్పు పెట్ట‌డం - పోలీసు వాహ‌నాల‌కు నిప్పు పెట్ట‌డం - బారికేడ్ల‌ను విర‌గ‌గొట్ట‌డంతో స‌హా ర‌క‌ర‌కాల హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న కారుల‌ను గుర్తించారు పోలీసులు. అలాంటి వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున నోటీసులు కూడా వెళ్లాయి. మొత్తం ప‌ద్నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని రాంపూర్ జిల్లా అడ్మినిస్ట్రేట‌ర్ నుంచి ఆందోళ‌న‌లో పాల్గొన్న ప‌లువురికి నోటీసులు వెళ్లాయి.

ప్ర‌భుత్వ ఆస్తులంటే ప్ర‌జ‌ల ఆస్తులే అని, వాటిని ధ్వంసం చేసే హ‌క్కు ఏ ఒక్క‌రికీ ఉండ‌ద‌ని, అలా విధ్వంసానికి పాల్ప‌డిన వారే అందుకు సంబంధించి ప్ర‌భుత్వానికి ప‌రిహారం చెల్లించాల‌ని జిల్లా అధికారి ఆందోళ‌న కారుల‌కు నోటీసులు ఇచ్చారు.

నిర‌స‌న‌లు - ప్ర‌ద‌ర్శ‌న‌ల పేరుతో ప్ర‌భుత్వ ఆస్తుల‌కు ధ్వంసం క‌లిగించ‌డం కొత్త ఏమీ కాదు. దేశంలో అదంతా సాగుతూనే ఉంటుంది. ఇలాంటి నేప‌థ్యంలో ధ్వంసం చేసిన వారికి ఇలా వ్య‌క్తిగ‌త నోటీసులు ఇవ్వ‌డం ఆస‌క్తిదాయ‌కంగా మారింది. విధ్వంసానికి గానూ అలా ఆందోళ‌న కారుల చేత ఫైన్ క‌ట్టించగ‌లిగితే... ఆ మేర‌కు చ‌ట్టాల‌కు కూడా ప‌దును పెడితే, ఎటువంటి ఆందోళ‌న‌లో అయినా ప్ర‌భుత్వ ఆస్తుల‌కు న‌ష్టం త‌గ్గుతుంది.పౌర‌స‌త్వ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ జ‌రిగిన ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మారి, మొత్తం 16 మంది మ‌ర‌ణించారు యూపీలో.