Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీ యూత్ ఐకాన్ అట‌!

By:  Tupaki Desk   |   25 Jan 2017 4:25 AM GMT
రాహుల్ గాంధీ యూత్ ఐకాన్ అట‌!
X
రాబ‌ర్ట్ వాద్రా... వ్యాపార‌వేత్త కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడిగా - ప్రియాంకా గాంధీ భ‌ర్త‌గానే జ‌నానికి తెలుసు. అత్త గారి అధికారాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద సంఖ్య‌లో కంపెనీల‌ను నెల‌కొల్పిన వాద్రా... మ‌న్మోహ‌న్ జ‌మానాలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజాయ‌తీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలిచిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా పుణ్యమా అని వాద్రా దందాల‌న్నీ దాదాపుగా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఇప్ప‌టికే వాద్రాకు చెందిన కంపెనీల‌న్నింటిపై లెక్క‌లేన‌న్ని కేసులు న‌మోద‌య్యాయి. అత్త‌గారి పార్టీ ఎంత గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయినా... వాద్రా మాత్రం బిజినెస్ మ్యాన్‌గానే ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ అడ‌పాద‌డ‌పా ఆయ‌న నోట పొలిటిక‌ల్ కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. ఈ కామెంట్స్ ఒక్కోసారి కాక పుట్టిస్తుంటే... కొన్ని సార్లు కామెడీగానూ అనిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న స‌మాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదిరింది. సింగిల్ గా వెళితే త‌ల బొప్పి క‌ట్ట‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న నేప‌థ్యంలో యూపీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌ తో కాంగ్రెస్ పార్టీ కాళ్ల బేరానికి దిగిన వైనం జ‌నాన్ని నివ్వెర‌ప‌ర‌చింద‌నే చెప్పాలి. అది కూడా మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ వార‌సురాలిగా జ‌నం ప‌రిగ‌ణిస్తున్న ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగితే కాని ప‌ని కాలేద‌ట‌. ఎస్పీతో పొత్తు నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప్రియాంకా కూడా ప్రచార బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకున్నారు. త‌న భార్య‌కు మ‌ద్ద‌తు ప‌లుకుదామ‌నుకున్నారో... లేదంటే త‌న బామ్మ‌ర్ది, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడి స‌త్తాను మ‌రోమారు ప్ర‌స్తావించాల‌నుకున్నారో... తెలియ‌దు కాని... నిన్న వాద్రా ఓ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు.

40 ఏళ్ల‌కు పైబ‌డ్డ వ‌య‌సు ఉండి,. గాంధీ కుటుంబం వార‌సుడిగా బ‌రిలోకి దిగి... బొక్క బోర్లా ప‌డ్డ రాహుల్ గాంధీని వాద్రా యూత్ ఐకాన్‌ గా అభివ‌ర్ణించారు. ప‌నిలో ప‌నిగా అఖిలేశ్ యాద‌వ్‌ ను కూడా యూత్ ఐకాన్‌ గానే వ‌ర్ణించిన వాద్రా... రాహుల్‌ - అఖిలేశ్‌ ల నాయ‌క‌త్వంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వెలిగిపోవ‌డం ఖాయ‌మేన‌ని చెప్పేశారు. ఇద్ద‌రినీ స‌మ‌ర్దులుగా తేల్చేసిన వాద్రా... వారిద్ద‌రినీ బ్రాండ్ ఐకాన్స్ గా చెప్పుకొచ్చారు. యూపీలో ఎస్పీ - కాంగ్రెస్ పార్టీల పొత్తు కేవ‌లం రాజ‌కీయ అంశం మాత్ర‌మేన‌ని చెప్పిన వాద్రా... వారిద్ద‌రి నాయ‌క‌త్వంలో యూపీ ప్ర‌పంచంలోనే అగ్ర‌శ్రేణి రాష్ట్రంగా ఎదుగుతుంద‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతున్నారు. అభివృద్ధి మాట దేవుడెరుగు... ఈ కూట‌మి విజ‌యం సాధిస్తుందో, లేదో మాత్రం వాద్రా చెప్ప‌డం మ‌రిచిపోయారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/