Begin typing your search above and press return to search.

కాబోయే సీఎం కొడుకు యవ్వారం.. దుమారం

By:  Tupaki Desk   |   14 Oct 2019 7:36 AM GMT
కాబోయే సీఎం కొడుకు యవ్వారం.. దుమారం
X
తమిళనాడు కాబోయే సీఎంగా ఇప్పుడు అందరినోటా వినిపిస్తున్న పేరు స్టాలిన్. అమ్మ జయలలిత మరణం తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. అంతటి బలమైన నేత మరణం తర్వాత అంతటి స్థాయి నేత అన్నాడీఎంకేలో లేరు. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా ఓడిపోయింది. స్టాలిన్ నేతృత్వంలోని ప్రతిపక్ష డీఎంకే గెలిచింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్నప్పుడు ఆయన వారసుడిగా స్టాలిన్ ను ఒక్కో మెట్టు ఎక్కించాడు. మొదట కార్యకర్తగా తర్వాత యువజన విభాగం అధ్యక్షుడిగా.. ఆ తర్వాత చైన్నై కార్పొరేషన్ మేయర్ - రాష్ట్ర మంత్రి - ఉప ముఖ్యమంత్రిని చేశాడు. ఇప్పుడు స్టాలిన్ కూడా తన వారసుడిగా ఆయన కుమారుడు - హీరో ఉదయనిధిని తెరపైకి తెచ్చాడు. కార్యకర్తగా మారిన అతడిని యువజన విభాగం అధ్యక్షుడిని చేశారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో స్టార్ ప్రచార కర్తగా మలిచాడు. ఉదయనిధి ప్రచారం చేసిన చోటల్లా గెలిపించుకు వచ్చాడు. ఆ తర్వాత తాజాగా మరో రెండు ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ బాధ్యతలను స్టాలిన్ కుమారుడికి అప్పగించాడు. ఈ ఫలితం వస్తే ఇక ఉదయనిధిని దేశంలోనే నాలుగో పెద్ద నగరం చెన్నైకి మేయర్ ను చేయాలని తలపోస్తున్నాడు.

ఆ తర్వాత మంత్రి, డిప్యూటీ సీఎం వరకూ పార్టీలో తన తర్వాత కుమారుడిని చేయడానికి స్లాలిన్ ప్లాన్ వేస్తున్నాడు. అయితే పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సీనియర్లు ఉదయనిధిని తెరపైకి తీసుకురావడాన్ని జీర్ణించుకోవడం లేదట.. ఉదయనిధి రాకతో గుర్రుగా ఉన్నారట.. ఇటీవల దీనిపై యువజన విభాగం నిర్వాహకుల మధ్య స్పర్థలు చెలరేగాయి. వర్గపోరు కూడా జిల్లాల్లో మొదలైంది.

దీంతో స్టాలిన్ డైలామాలో పడ్డారు. ఉదయనిధిని తెరపైకి తెస్తే పార్టీలో అసమ్మతి చెలరేగే ప్రమాదం ఉందని స్టాలిన్ ను ఆయన రాజకీయ సలహాదారు గ్రూపు ఓఎంజీ హెచ్చరించింది. స్టాలిన్ సీఎం అయ్యాక కుమారుడికి మార్గం సుగమం చేయాలని సూచించిందట.. ఉదయనిధికి ప్రాధాన్యం ఇస్తే అన్నాడీఎంకే, రజినీకాంత్ పార్టీలకు సానుకూలంగా మారే అవకాశముందని సలహాదారులు హెచ్చరించారట.. అంతేకాక.. ఉదయనిధిని చెన్నై మేయర్ కాకుండా ఇప్పటికే అధికార అన్నాడీఎంకే చెన్నై కార్పొరేషన్ పదవిని మహిళకు కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తుండడం కొసమెరుపు. ఇలా తన వారసుడిని డీఎంకేలో తెచ్చేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తుండగా.. దానికి ఎసరు పెట్టేలా పార్టీలో, ప్రత్యర్థులు కాచుకూర్చుండడం డీఎంకేలో కాకరేపుతోంది.