Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు పూర్వ వైభవం మార్గం దొరుకుతుందా ?

By:  Tupaki Desk   |   10 May 2022 4:30 PM GMT
కాంగ్రెస్ కు పూర్వ వైభవం మార్గం దొరుకుతుందా ?
X
మేథోమదన సదస్సు నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆశలే పెట్టుకున్నట్లుంది. ఈనెల 13-15 మధ్య రాజస్ధాన్లోని ఉదయ్ పూర్ లో కీలక సదస్సు జరుగనున్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికలకు ఈ సదస్సు ఒక మార్గదర్శనం చేస్తుందని సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. నిరాశాజనక వాతావరణం పోయి వెంటనే ఉల్లాసభరితమైన వాతావరణం రావాలని, పార్టీకి మంచి రోజులు వస్తాయని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశిస్తున్నారు.

కీలక సదస్సుకు మూడురోజుల ముందు ఢిల్లీలోనే సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. సదస్సులో పార్టీ నేతలు అనుసరించాల్సిన విధివిధానాలను సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా నిర్దేశించారు. అంతా బాగానే ఉంది కానీ సోనియా ఆశించినట్లు ఎంతమంది సీనియర్లు నడుచుకుంటారన్నదే ఇంట్రస్టింగ్ పాయింట్. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మేథోమధన సదస్సులు గతంలో 1998, 2003, 2013లో జరిగాయి.

1998లో జరిగిన సదస్సు పార్టీకి పెద్దగా ఉపయోగపడిందేమీలేదు. 2003లో జరిగిన సదస్సు మాత్రం పార్టీకి బాగానే ఉపయోగపడింది. ఎలాగంటే పార్టీలో సీనియర్లు కాస్త నిజాయితీతో పార్టీలోని లోపాలను ప్రస్తావించటమే కాకుండా వాటిని ఎలా సరిచేసుకోవాలనే విషయాలను కూడా ప్రస్తావించారు.

సమస్యలకు సమిష్టి బాధ్యతలను తీసుకోవాలని అప్పట్లో చాలామంది సీనియర్ల వేదిక మీదనే సోనియాకు డైరెక్టుగా సూచించారు. దాంతో సీనియర్లు, జూనియర్లంతా కలిసి పార్టీకోసం పనిచేశారు.

కారణాలు ఏవైనా అప్పటి ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్ పేయ్ నేతృత్వంలోని బీజేపీని కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి వచ్చింది. దానిదెబ్బకు కాంగ్రెస్ తిరుగులేకుండా పదేళ్ళపాటు కేంద్రంలో అధికారాన్ని చెలాయించింది.

అయితే ఈ సమయంలోనే అవినీతి ఆరోపణలు పెరిగిపోవటం, పార్టీపై సోనియా+మన్మోహన్ సింగ్ కు అదుపు తప్పిపోవటం లాంటి అనేక మైనస్సుల వల్ల 2014లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటినుండి పార్టీ మళ్ళీ కోలుకోలేదు. ప్రస్తుతం పార్టీకి లోక్ సభలో 53 మంది, రాజ్యసభలో 29 మంది ఎంపీలున్నారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ పుంజుకుని అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ కలలు నెరవేరుతుందా ?