Begin typing your search above and press return to search.

మంత్రివర్గాన్ని డబుల్ చేస్తున్న జగన్...?

By:  Tupaki Desk   |   28 April 2022 12:30 PM GMT
మంత్రివర్గాన్ని డబుల్ చేస్తున్న జగన్...?
X
అపుడెపుడో ఎనభయ్యవ దశకంలో టంగుటూరి అంజయ్య ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. ఆయన టైమ్ లో మంత్రులు డెబ్బై ఎనిమిది మంది దాకా ఉండేవారు. నాడు మంత్రులు ఇంతమందే ఉండాలని పరిమితి అంటూ లేదు. దాంతో అంజయ్య జంబో క్యాబినేట్ నే ఏర్పాటు చేశారు. అలా అప్పట్లో కొత్తగా మంత్రులు అయిన వారిలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఇక దేశంలో కూడా ఈ రోజుకీ దాన్ని ఒక రికార్డుగానే చూస్తారు.

తరువాత రోజుల్లో మొత్తం హౌస్ లో పదిహేను శాతం మించి మంత్రులు ఉండరాదు అని నిబంధన తెచ్చారు. దాంతో ఎలా చూసుకున్నా 44కి మించి ఉమ్మడి ఏపీలో మంత్రులను తీసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. విభజన ఏపీలో చూసుకుంటే సీఎం తో కలిపి 26 మంది ఉన్నారు. అయితే వైసీపీ తరఫున గెలిచిన వారు 151 మంది. దాంతో అందరికీ మంత్రి పదవులు కావాలి. ఈ నేపధ్యంలో ఈ అతి పెద్ద పోటీని తట్టుకోవడానికి మొదట్లో జ‌గన్ ఆలోచించిన విధానం ఏంటి అంటే సగం కాలానికే మంత్రులను పరిమితం చేసి కొత్త వారికి చాన్స్ ఇవ్వడం.

అలా రీసెంట్ గా మరో మంత్రి వర్గ విస్తరణ జరిగినా పాతవారు 11 మంది కంటిన్యూ అయ్యారు. దాంతో కొత్తగా 14 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మరి మిగిలిన వారి సంగతేంటి, తాజా మాజీ మంత్రుల ఆసంతృప్తికి అడ్డుకట్ట వేసే మార్గమేది అంటే జగన్ ఆలోచించిన మరో పధకమే జిల్లా అభివృద్ధి మండళ్ళు, ప్రస్తుతం జిల్లాలకు వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్న వారినే అభివృద్ధి మండళ్లకు చైర్మన్లుగా నియమించడం అన్న మాట.

అంతే కాదు వారికి క్యాబినేట్ హోదాను కల్పించడం, అంటే వారు మంత్రులతో సమానం అన్న మాట. టెక్నిక‌ల్ గా వారిని మంత్రులు అనలేకపోయినా వారు కూడా మంత్రులే అని చెప్పవచ్చు. ఇక ప్రతీ జిల్లాకు అభివృద్ధికి నిధులను కేటాయించి దాన్ని అభివృద్ధి మండళ్ల చేత ఖర్చు చేయించాలి అన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. అలా వారికి హోదా, నిధులు, విధులను కల్పించాలని చూస్తున్నారు.

ఒక విధంగా వారిని మంత్రులతో సమానం చేస్తున్నారు. అదే కనుక అమలు అయితే అపుడు ఏపీలో మంత్రులు ఎంతమంది అంటే 52 అని చెప్పుకునేలా ఈ కొత్త ఆలోచన ఉంది అన్న మాట. తొందరలోనే అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేయడం, వాటికి చైర్మన్లుగా 26 జిల్లాల ప్రెసిడెంట్లను నియమించడం చకచకా జరిగిపోయే ప్రక్రియ. అంటే రాజ్యాంగం ప్రకారం పరిమితికి మించి మంత్రులను తీసుకోకూడదు కాబట్టి ఇతర మార్గాలలో ఏ ఇబ్బంది లేకుండా కొత్త మంత్రులను చేయడం అన్న మాట. మొత్తానికి జగన్ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం దేశంలో మిగిలిన వారు కూడా ఇలాగే అనుసరించే వీలు ఉంటుంది.

ఇక జనాలకు ఎంతో మంది సేవకులు కూడా ఈ విధంగా లభిస్తారు అన్న మాట. ఏది ఏమైనా ఒక్క మాట అయితే చెప్పుకోవాలి. జగన్ అపర విశ్వామిత్రుడు. ఆయన పదవులను పెంచడంలోనూ పంచడంలోనూ స్పెషలిస్ట్ అని కూడా అనాలి. లెక్కకు మిక్కిలిగా ప్రభుత్వ సలహాదారులు, అలాగే నామినేటెడ్ పదవులు, వాటికి క్యాబినేట్ ర్యాంకులు. ఇపుడు ఈ సరికొత్త పద‌వులు. ఇస్తున్నారు. మాకు ఏ పదవులు లేవు, రావు అని వైసీపీలో ఎవరైనా అనుకోవాల్సిన పనే ఇక మీదట లేదు. కాకపోతే జగన్ అనుగ్రహం మాత్రం వారికి నిండుగా ఉండాలి అంతే.