Begin typing your search above and press return to search.

ఏపీని చుట్టేసే వీరుడు : త్వరలో చూడబోతున్నారు...?

By:  Tupaki Desk   |   30 May 2022 10:30 AM GMT
ఏపీని చుట్టేసే వీరుడు : త్వరలో చూడబోతున్నారు...?
X
లోకం చుట్టిన వీరుడు అని గతంలో ఒక సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయింది. ఇక రాజకీయాల్లో చూస్తే ఎన్టీయార్ ఉమ్మడి ఏపీని చుట్టేసి అధికారం పట్టేశారు.ఆయన చైతన్య రధం మీద నుంచి ఏపీ అంతటా తిరిగారు. ఇక ఆ తరువాత పాదయాత్రలకు ఆద్యుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర‌రెడ్డిని చెప్పుకోవాలి. ఆయన ఉమ్మడి ఏపీని మండుటెండలలో తిరిగి 2004లో కాంగ్రెస్ కి అధికారం సంపాదించారు. ఆ ఒరవడి అతి పెద్ద పొలిటికల్ సెంటిమెంట్ గా మారడంతో 2013లో చంద్రబాబు కూడా అదే బాట పట్టి అధికారంలోకి వచ్చారు.

ఇక వైఎస్సార్ తనయుడు జగన్ కూడా 2017లో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. అలా సీఎం సీటుకు దగ్గర దారిగా పాదయాత్ర మారిన వేళ ఏపీలో మరో నాయకుడు అదే బాట పట్టబోతున్నారు. ఆయన ఎవరో కాదు, చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ బాబు.

లోకేష్ పాదయాత్ర చేయాలని ఉరకలు వేస్తున్నారు. నిజానికి చాలా కాలం నుంచే పార్టీలో ఈ విషయం నలుగుతోంది. అయితే ఫలితాలుఎలా ఉంటాయో అన్న ఆందోళన అయితే నాడు కొంత ఉండేది. కానీ ఇపుడు చూస్తే మహానాడు తరువాత ఏపీలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది అని టీడీపీ చాలా గట్టిగానే నమ్ముతోంది.

సరిగ్గా ఇదే కరెక్ట్ టైమ్ అని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఈ సమయంలో కనుక లోకేష్ బాబుతో పాదయాత్ర చేయిస్తే సూపర్ హిట్ అయి తీరుతుందని అని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారుట. దానికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజు నుంచి పాదయాత్రకు లోకేష్ రెడీ అవుతారు అని అంటున్నారు.

ఈ అక్టోబర్ 2 కి టీడీపీలో ఒక సెంటిమెంట్ ఉంది. 2012 అక్టోబర్ 2న చంద్రబాబు కూడా పాదయాత్రకు ముహూర్తంగా పెట్టుకున్నారు. దాంతో తండ్రి మాదిరిగానే లోకేష్ కూడా పాదయాత్ర చేపట్టి హిట్ కావాలని చూస్తున్నారు అంటున్నారు.

ఈ పాదయాత్ర ఏఏ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది, రూట్ మ్యాప్ ఏంటి అన్నది ఇపుడు కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి మహానాడు ఊపుని అలాగే కంటిన్యూ చేయడం ద్వారా 2024 ఎన్నికల్లో అధికారం అందుకోవడానికి టీడీపీ పకడ్బంధీ ప్లాన్ తోనే సిద్ధమవుతోంది. మరి లోకేష్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో ఏ రకమైన ప్రకంపనలు రేపనుందో చూడాల్సిందే.