Begin typing your search above and press return to search.

గప్ చుప్ : రెండేళ్ళూ నోరు విప్పితే ఒట్టు...?

By:  Tupaki Desk   |   7 May 2022 5:11 AM GMT
గప్ చుప్ : రెండేళ్ళూ నోరు విప్పితే ఒట్టు...?
X
అవునా అంత పెద్ద ఒట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు. ఏమైందని అలాంటి భారీ నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే దాని వెనక చాలా కధ ఉంది. అవును మరి రాజకీయంగా తమ పొలిటికల్ ఫ్యూచర్ ఎవరైనా చూసుకోవద్దూ. అధినాయకుడు కూడా రెండేళ్ళకు ముందే తమ జాతకల గురించి చాలా జాగ్రత్తగా విడమరచి చెప్పాడు కదా.

ఎవరి గ్రాఫ్ ఢమాల్ మన్నా టికెట్లు గల్లంతే అని కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు కదా. అద్గతీ సంగతి. మరి రాజకీయం ఏ ఒక్కరి ఇంట్లోనో ఒంట్లోనూ ఉండదు, అది గాలి లాంటిది. అన్ని వైపులా చక్కగా ప్రసరిస్తుంది. అందుకే అధినేత జగన్ అలా స్ట్రాంగ్ డోస్ ఇచ్చారోలేదో ఇలా వైసీపీలో చాలా నోళ్ళు మూతపడిపోయాయి. అంతా గప్ చుప్ అయిపోయింది.

అసలు మ్యాటరేంటి అంటే రెండేళ్ల తరువాత కూడా తమ గ్రాఫ్ ఏ మాత్రం పెరగకపోవచ్చు. ఫర్ సపోజ్ అలా అనుకుంటే కనుక టికెట్ దక్కదు కదా. ఇది ముందు తెలివిడి అన్న మాట. సరే చాలా కష్టపడి గడప గడపకూ వైసీపీ అంటూ ప్రతీ కనబడ్డ వారికీ దండాలు పెట్టుకుంటూ తిరిగినా గ్రాఫ్ పెరిగింది అని ఎవరు చెబుతారు ఇది చాలా పెద్ద డౌట్.

అంతే కాదు ఈ గ్రాఫులు పెరగడాలు, తగ్గడాలు వీటిని కొలిచే పారామీటర్ ఏది అది ఎక్కడ ఉంటుంది. ఇది కూడా చిత్రమైన ప్రశ్నగానే చూడాలి. అంటే తమకు నచ్చని క్యాండిడేట్ నో తాము అనుకున్న తీరున పనిచేయని వారినో లేక ఫలానా ప్లేస్ లో వేరొకరికి టికెట్ ఇవ్వాలనుకున్నపుడో నీ గ్రాఫ్ బాలేదు టికెట్ ఇవ్వను అని లెవెన్త్ అవర్ లో చెబితే అపుడు గతేంటి.

మరి అక్కడ ముదుర్లు అయిపోతారు అంతా. అంటే అధికార పార్టీ చేస్తున్న సర్వేలు కానీ చేశామని చెప్పుకుంటున్నవి కానీ ఎవరూ పెద్దగా నమ్మరు అనే కదా ఇక్కడ తెలుస్తోంది. మరో వైపు చూస్తే తమకు టికెట్ దక్కుతుందో దక్కదో తెలియని ఒక అయోమయాన ప్రత్యర్ధి పార్టీని దారుణంగా తిట్టేసి నోటి దురద తీర్చేసుకున్నాక ఆనక చావు కబురు చల్లగా చెబుతూ టికెట్ ఇవ్వకపోతే అపుడు సంగతేంటి.

అందుకే వైసీపీలో పనితీరు బాగాలేదు ఎమ్మెల్యే సార్లూ మీ తీరు మార్చుకోండి, ఒక ఏడాది టైమ్ ఇస్తున్నామని హై కమాండ్ సుతిమెత్తగా చెప్పినా కూడా వినే వారికి వేరేగా అర్ధాలు తోస్తున్నాయట. దాంతో మనకెందుకీ తగలాటమని అంతా ఫుల్ సైలెంట్ అయిపోతున్నారు అని అంటున్నారు.

ఇలా గ్రాఫ్ బాలేదు, పనితీరు జోరు చేయండి అని చెబితే పార్టీ పరుగులు తీస్తుందని, ఫ్యాన్ రెక్కలు మరింత స్పీడ్ అందుకుంటాయని హై కమాండ్ ఒకలా తలపోస్తే లీడర్లు మాత్రం మరోలా అర్ధం చేసుకుని గమ్మునుంటున్నారు అని అంటున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ దూకుడు పెంచింది. రోజుకు పది నుంచి పదిహేను మంది నాయకులు వంతున వైసీపీ మీద దారుణమైన విమర్శలు చేస్తున్నారు. అందులో నిజానిజాలు పక్కన పెడితే పార్టీలో ఉన్న వారిగా గట్టి కౌంటర్లు ఇవ్వాలిగా. కానీ సీన్ చూస్తే రివర్స్ లో ఉంది.

ఈ రోజు బాబు గారినో మరో పార్టీనో తిట్టేస్తే రేపటి రోజున సొంత పార్టీలో టికెట్ హుళక్కి అయిపోతే అక్కడ ఏ ముఖం పెట్టుకుని అక్కడకు వెళ్తామని రాజకీయ తెలివిడి ఎక్కువైన వారు అంతా కామ్ అయిపోతున్నారుట. దాంతో ఇపుడు ఏపీ రాజకీయాల్లో విపక్షం మాటే పెద్దగా సౌండ్ చేస్తోంది.

వారు చెప్పిందే నలు దిక్కులా వినిపిస్తోంది. మరి ఇదంతా ఎవరు చేసుకున్నారు అంటే అధినాయకత్వమే చేజేతులా చేసుకుంది అన్న మాట కూడా ఉంది. ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉండగానే గ్రాఫ్ బాలేదు అంటూ పంచాయతీలు పెడితే డౌట్ ఉన్న వారు ఇలాగే సైడ్ అయిపోతారు ఇదే వర్తమాన రాజకీయం చెబుతున్న మహా నీతి. నోట్ దిస్ పాయింట్.