Begin typing your search above and press return to search.

అమ్మ ఒడికి.. అలవి కాని ఆంక్షలు

By:  Tupaki Desk   |   15 April 2022 6:53 AM GMT
అమ్మ ఒడికి.. అలవి కాని  ఆంక్షలు
X
అమ్మ ఒడి. ఇది జగన్ మానస పుత్రిక. పాదయాత్ర సమయాన ఆయన మదిలో మెదిలిన పధకం. ఏపీలో ఇకపైన ఏ పేద బిడ్డ డబ్బు లేక చదువులు మధ్యలో ఆపరాదు అని జగన్ భావించి అమ్మ ఒడిని ప్రవేశపెడతామని చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది కానీ అధికారంలోకి వచ్చాక ఒక ఇంటికి ఒక బిడ్డకే అని తొలి రోజుల్లోనే మడమ తిప్పేశారు.

అదే టైమ్ లో మరో పని కూడా చేశారు. కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాల్సిన ఈ పధకాన్ని ప్రైవేట్ స్కూళ్ళకు విస్తరించారు. ఇక రెండేళ్ల పాటు విద్యా సంవత్సరం మధ్యలో ఈ పధకం కింద తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయల నిధులు వేసేవారు. ఇక మూడవ ఏడాది రావడంతోనే దాన్ని విద్యా సంవత్సరం చివరకు అని వెనక్కు తీసుకుపోయారు.

ఇపుడు చూస్తే బోలెడు ఆంక్షలు పెడుతూ అమ్మ ఒడికి తూట్లు పొడుస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. కుటుంబం వాడే గృహ విద్యుత్ యూనిట్లు మూడు వందలు దాటకూడదు, ఇక నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకూ చూస్తే డెబ్బై అయిదు శాతం విద్యార్ధి హాజరు ఉండాలి.

ఇక మరో కండిషన్ ఏంటి అంటే ఆధార్ కార్డులో ప్రస్తుతం పాత జిల్లా ఉంటే దాన్ని మార్చి కొత్త జిల్లాలో పేర్లు నమోదు చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ ని లింక్ చేసుకోవాలి.

అలాగే విద్యార్ధి ఈకేవైసీ అప్ డేట్ చేసుకోవాలి. పన్నులు కట్టేవారు ఈ పధకానికి అనర్హులుగా డిసైడ్ చేశారు. ఇవన్నీ వినడానికి చిన్నగా కనిపించినా కష్టమైన ఆంక్షలే అంటున్నారు. లబ్దిదారుల సంఖ్యను వీలైనంతవరకూ తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ రకంగా షరతులు కొత్తగా తెచ్చి పెడుతోంది అని అంటున్నారు.

వీటిని పూర్తి చేసినా ఇంకా ఏమేమి కొర్రీలు వేస్తారో అన్న డౌట్ కూడా వ్యక్తం అవుతోంది. మొత్తానికి మూడేళ్ళకే అమ్మ ఒడి భారం అయిందా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. ఇదే రకమైన కండిషన్లతో ఎన్నేళ్ళు ఈ పధకాన్ని నడపగలరు అన్న చర్చ కూడా ఉంది. అమ్మలకు మాత్రం ఇది అగ్ని పరీక్ష అని అంటున్నారు.