Begin typing your search above and press return to search.

బాబు బాటలో జగన్ : ఆయన రూటే కరెక్ట్...?

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 AM GMT
బాబు బాటలో జగన్ : ఆయన రూటే కరెక్ట్...?
X
చంద్రబాబు దార్శనీకుడు విజనరీ అంటే వైసీపీ నేతలు ఒక్క లెక్కన విమర్శలు చేస్తారు కానీ ఆయన చాలా విషయాల్లో అందరి కంటే ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే ఆయనకు ఎపుడేమి చేయాలో తెలుసు. బాబు నిజంగా చాణక్యుడే. ఆయన మనసు పెట్టి చేయాలే కానీ కచ్చితంగా హిట్టే అని కూడా ప్రత్యర్ధులు అంగీకరిస్తారు. ఇక విభజన ఏపీని ప్రగతి పట్టాలెక్కించాలని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా ప్రతీ ఏడాది ఠంచనుగా దావోస్ టూర్ కి వెళ్లేవారు. అదే విధంగా విశాఖలో అనేక సార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించి ఏపీ గురించి జాతీయ అంతర్జాతీయ‌ తెర మీద గొప్పగా చెప్పేవారు.

దాని ఫలితాలు కూడా బాగానే వచ్చాయి. ఇక ఇపుడు అంటే మూడేళ్ళ తరువాత జగన్ కూడా బాబు గారి బాటలోనే నడుస్తున్నారా అంటే అవును అని జవాబు వస్తోంది. నిజానికి జగన్ స్వతహాగా బిజినెస్ మాన్. ఆయనకు పెట్టుబడులు ఎలా తేవాలీ అన్న దాని మీద ప్రత్యేకమైన ఆలోచనలు ఉండాలి. కానీ మూడేళ్ళు గడచినా ఏపీకి పెట్టుబడులు పెద్దగా వచ్చినది లేదు. దాంతో విమర్శలు వెల్లువెత్తాయి.

మరో వైపు ఏపీలో ఇప్పటికీ బాబు తెచ్చిన పెట్టుబడులు, ఆయన ఒప్పించిన కంపెనీలే ఉన్నాయి తప్ప కొత్తవి స్థాపించబడలేదు. దాంతో జగన్ మూడేళ్ళ తరువాత తొలిసారి తన ఏలుబడిలో దావోస్ వెళ్ళారు. అక్కడ నుంచి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు వచ్చాయని వైసీపీ ప్రచారం అయితే చేసుకుంది. దాని సంగతి అలా ఉంటే ఏపీ సర్కార్ దావోస్ ట్రిప్ వేయడం మాత్రం ఈ సమయంలో మంచి పరిణామమే అని అంతా అనుకున్నారు.

ఇక ఇపుడు చూస్తే విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సుని నిర్వహించడానికి జగన్ చూస్తున్నారు. అంటే ఇది కూడా బాబు రూటే అన్న మాట. నాడు బాబు పెట్టుబడుల సదస్సు పెడితే అంతా ఉత్తుత్తిదే అని విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇపుడు జగన్ కూడా అదే చేయడం చూసి ఏమంటారో తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ఇన్వెస్టర్లతో ఈ భారీ సదస్సు నిర్వహిస్తారు అని తెలుస్తోంది. సాధ్యమైనత త్వరలోనే విశాఖలో ఈ సదస్సు జరుగుతుంది అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని జగన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

అంటే ఏపీలో భారీ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఇన్వెస్టర్లకు చెబుతారు అన్న మాట. నాడు విశాఖ సాగర తీరంలో జరిగినట్లుగానే విశాఖను ఇతర టైర్ టూ నగరాలను చూపించి పెట్టుబడులు పెట్టమని కోరుతారు అన్న మాట. మరి వైసీపీ ప్రభుత్వ పాలసీ గురించి కూడా చర్చ సాగుతుంది. అలాగే ఏపీలో ఉన్న అన్ని రకాలైనా వాతావరణం అనుకూలిస్తేనే పెట్టుబడులు పెడతారు. ఈ విషయంలో నాడు వైసీపీ చేసిన యాగీ ఇపుడు టీడీపీ చేయకుండా అంతా కలసి ఏపీకి పెట్టుబడులు వచ్చేలా చూస్తే మంచిదే అంటున్నారు.