Begin typing your search above and press return to search.

పెరిగిపోతున్న ‘మహా’ టెన్షన్

By:  Tupaki Desk   |   23 Jun 2022 6:16 AM GMT
పెరిగిపోతున్న ‘మహా’ టెన్షన్
X
మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో ఏమి జరుగుతుందో అర్ధంకాక అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారని కొందరు, చేయలేదని కొందరు చెబుతున్నారు. తన రాజీనామా లేఖను ఎవరైనా ఎంఎల్ఏ వచ్చి తీసుకుని వెళ్ళి రాజ్ భవన్లో ఇవ్వచ్చని సీఎం చెప్పటంతో గందరగోళం మరింతగా పెరిగిపోయింది.

ఇదే సమయంలో ఉద్థవ్ రాజీనామా చేయలేదని అసెంబ్లీలో బల పరీక్షకు రెడీ అయినట్లు పార్టీ అధికారప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. దాంతో ఎవరి ప్రకటన నిజమో అర్ధంకాక పార్టీల్లోనే కాకుండా మొత్తం జనాల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది.

సీఎం రాజీనామా చేశారనేందుకు ఆధారం ఏమిటంటే అధికార నివాసం వర్షను ఖాళీ చేసి సొంత నివాసం మాతోశ్రీకి కుటుంబంతో కలిసి ఉధ్థవ్ వెళ్ళిపోయారు. సీఎం చెప్పినట్లుగా ఆయన రాజీనామా లేఖను తీసుకోవటానికి ఎవరూ మాతోశ్రీకి వెళ్ళలేదట.

అయితే ఇదే సమయంలో శివసేన తిరుగుబాటు నేత, మంత్రి ఏక్ నాథ్ షిండేకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎంవిఏ భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రతిపాదించినట్లు వార్తలతో గందరగోళం పెరిగిపోతోంది. ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఉధ్థవ్ సీఎంగానే కాకుండా పార్టీ అధ్యక్షపదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకానీ తాను రాజీనామా చేసినట్లు ఎక్కడా చెప్పలేదు. అయితే ఆ తర్వాత నుండి రాజీనామా చేసినట్లు ప్రచారం పెరిగిపోయింది.

తాజా పరిణామాలు, సంక్షోభంపై భాగస్వామ్య పార్టీలు సమావేశం జరిగినట్లు లేదు. ఎందుకైనా మంచిదని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంఎల్ఏలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి. మొత్తానికి శాసనమండలి ఎన్నికల్లో రగిలిన చిచ్చు చివరకు ప్రభుత్వం సంక్షోభంలోకి కూరుకుపోయేవరకు పెరిగిపోయింది. ఈ మొత్తం సంక్షోభానికి గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీయే కారణమని అధికార కూటమి తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది.

ఎప్పుడో జరగాల్సిన శాసన మండలి ఎన్నికలను కావాలనే పక్కనపెట్టినట్లు ఆరోపణలున్నాయి. శివసేనలో చీలిక వచ్చేంతవరకు గవర్నర్ వెయిట్ చేశారని, గవర్నర్ ను అడ్డుపెట్టుకునే బీజేపీ తెరవెనుక కథంతా నడిపిస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమవుతుందో ఏమో ?