Begin typing your search above and press return to search.

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థా? బీఆర్ఎస్ అభ్యర్థా?

By:  Tupaki Desk   |   5 Oct 2022 5:12 AM GMT
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థా? బీఆర్ఎస్ అభ్యర్థా?
X
ఇంతకాలం టీఆర్ఎస్ గా సుపరిచితమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు పేరు మార్చుకుంటుందన్న విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న వేళ.. అనుకున్న టైం రానే వచ్చింది.

ఈ రోజు (బుధవారం)మధ్యామ్నం 1.19 నిమిషాల సమయంలో పార్టీకి మారుస్తున్న కొత్త పేరును పార్టీ అధినేత కేసీఆర్ తన నోటి నుంచి తానే స్వయంగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దసరా పర్వదినాన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రెస్ మీట్ లో తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా ప్రకటించనున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో గులాబీ అభ్యర్థి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారా? లేదంటే కొత్తగా పేరు మార్చిన పార్టీ పేరు మీద పోటీ చేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

కొత్త పార్టీ పేరును ప్రకటించిన అనంతరం దానికి సంబంధించిన సాంకేతిక అంశాల్ని ఈసీకి సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈసీ విడుదల చేసిన మునుగోడు ఉప పోరు నోటిఫికేషన్ చూసినప్పుడు నామినేషన్ దాఖలుకు 15 చివరి తేదీగా నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు చేసే పార్టీ పేరు మీద అభ్యర్థిని పోటీకి దించాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ధ్రువీకరణ లభించాల్సి ఉంటుంది.

అయితే.. అప్పటికి ఆ ప్రాసెస్ పూర్తి అవుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్న. టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పార్టీ పేరు మార్చటం చాలా చిన్న విషయమని.. దానికి పెద్ద ఇబ్బందులు ఉండవన్న వాదనను వినిపిస్తున్నారు. దీనికి తగ్గట్లే.. శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్న టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్.. ఈసీ వద్దకు వెళ్లి పార్టీ పేరు మార్పు దరఖాస్తును అందజేస్తారని చెబుతున్నారు.

నామినేషన్ గడువు లోపు ఎన్నికల సంఘం నుంచి పార్టీ మార్పు ఆదేశాలు జారీ అయితే.. కొత్త పేరు మీద.. ఒకవేళ ఆ ప్రాసెస్ పూర్తి కాకుంటే టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని చెబుతున్నారు. ఒకవేళ కొత్త పార్టీ పేరు మీద పోటీ చేస్తే మాత్రం.. ఆ అరుదైన అవకాశం మునుగోడు అభ్యర్థికి దక్కుతుందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.